Not Allowing Outside Food in Gurukul and Welfare Hostels : రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా గురుకుల, సంక్షేమ శాఖ హాస్టళ్లల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు జరగకుండా సంక్షేమ శాఖలు, గురుకుల సొసైటీలు అప్రమత్తమయ్యాయి. బయట నుంచి తీసుకువచ్చిన ఆహారాన్ని వసతి గృహాల్లో, విద్యాలయాలు అనుమతించడం లేదని, ఈ నిషేధాన్ని మరింత కఠినంగా అమలు చేయాలని గురుకులాల ప్రిన్సిపాళ్లకు, వార్డెన్లకు ఆదేశాలు జారీ చేశాయి. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఘటనల నేపథ్యంలో సంక్షేమశాఖల ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల సంక్షేమ అధికారులు, గురుకులాల ప్రాంతీయ సమన్వయకర్తలు, ప్రిన్సిపాళ్లతో సొసైటీలు సమీక్ష నిర్వహిస్తున్నాయి.
పిల్లల కోసం తల్లిదండ్రులు బిర్యానీ, చిరుతిళ్లు తీసుకువస్తే ఎట్టి పరిస్థితిలోనూ వాటిని అనుమతించవద్దని సొసైటీలు సూచించాయి. ఉదయం వండిన అన్నం మధ్యాహ్నం.. మధ్యాహ్నం వండిన ఆహారాన్ని సాయంత్రానికి వడ్డించినట్లు వెల్లడైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించాయి. విద్యార్థులకు వేడివేడిగా ఉండే టిఫిన్, భోజనమే అందించాలని తెలిపాయి. వడ్డించేందుకు రెండు నుంచి మూడు గంటల ముందే వంట చేయాలని వివరించాయి. రాత్రికి 6 నుంచి 7 గంటల మధ్య వేడి ఆహారం వడ్డించి పూర్తి చేయాలని సూచించాయి.