Water Supply For Forest Animals In TS :వేసవి సమీపిస్తున్న తరుణంలో రోజురోజుకూ భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. కొన్ని గ్రామాల్లో ప్రజలు సూదూర ప్రాంతాలకు వెళ్లి బిందెలతో నీళ్లు తెచ్చుకుంటున్నారు. సాగునీరందక కొన్ని ప్రాంతాల్లో పంటలకు సైతం ఎండిపోతున్నాయి. మనుషులే ఇన్ని ఇబ్బందులు పడుతుంటే ఇక అడవుల్లో మూగజీవాల పరిస్థితి దయనీయంగా ఉంటుంది. దీంతో మెదక్ జిల్లా నర్సాపూర్ అటవీ శాఖఅధికారులు ముందు చర్యలు చేపట్టారు. అడవిలో నీటి కుంటలు, చెక్ డ్యామ్‌లు నిర్మించి సౌర పంపుసెట్ల ద్వారా వన్యప్రాణుల దాహార్తి తీరుస్తున్నారు.
Forest Department Setup Check Dams : మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రాంతంలో 11వేల 700 హెక్టార్లల్లో అటవీ ప్రాంతం ఉంది. ఇక్కడ కోతులు, ఎలుగుబంట్లు, కొండ గొర్రెలు, కుందేళ్లు వంటి వన్య ప్రాణులు ఉన్నాయి. సాధారణ రోజుల్లో అడవిలో నీటి సమస్య ఉండదు. కానీ వేసవి వేళ జంతువులు ఇబ్బందులు పడుతుంటాయి. కొన్నిసార్లు అడవిదాటి బయటకి వెళ్లే అవకాశమూ ఉంటుంది. ఈ నేపథ్యంలో వన్యప్రాణుల రక్షణ కోసం అటవీ అధికారులు వినూత్న చర్యలు చేపట్టారు. అడవి జంతువులు బయటకు వెళ్లి వేటగాళ్ల ఉచ్చులో చిక్కకుండా , రోడ్డు దాటుతూ ప్రమాదాలకు గరికాకుండా వాటి దాహార్తిని తీర్చడానికి శాశ్వత చర్యలు చేపట్టారు.
"నర్సాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో 22 బ్లాక్‌లు ఉన్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం వీటిలో సోలార్ పంప్‌లను ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా వణ్యప్రాణులు బయటకు వెళ్లకుండా అడవిలోనే దాహార్తిని తీర్చుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇచ్చట కొండగొర్రెలు, దుప్పిలు, చిరుతలు ఇలాంటి ఎన్నో వన్యప్రాణలు ఉన్నాయి" - బి.అంబర్ సింగ్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్