Water Board About Drinking Water Crisis in Hyderabad : గ్రేటర్ హైదరాబాద్‌లో తాగునీటి సరఫరాపై జల మండలి ప్రత్యేక దృష్టి సారించింది. భూగర్భ జలాలు అడుగంటిపోవడం, జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గడంతో కోటిన్నరకు పైగా జనాభా ఉన్న హైదరాబాద్‌లో కూడా బెంగళూరు (Bengaluru) పరిస్థితి రావొచ్చనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. అప్రమత్తమైన జలమండలి వేసవిలో తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేసింది. నగరవాసులకు తాగునీటి కష్టాలు తలెత్తకుండా గతేడాది కంటే మరో 10 ఎంజీడీల నీటిని ఎక్కువగా సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రోజు విడిచి రోజు కుటుంబానికి 20 వేల లీటర్లు నీటిని సరఫరా చేస్తోంది.
డెడ్ స్టోరేజీ నుంచి నీటి తరలింపు :ఇందుకోసం ఉస్మాన్‌సాగర్ (Osman Sagar), హిమాయత్ సాగర్‌లతో పాటు మంజీరా, సింగూరు, కృష్ణా, గోదావరి నదుల నుంచి 600 ఎంజీడీల నీటిని వాడుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం నాగార్జున సాగర్‌లో డెడ్ స్టోరేజీ లెవల్‌పైన 7.06 టీఎంసీల నీటి లభ్యత ఉంది. మరోవైపు గోదావరి జలాల కోసం ఎల్లంపల్లి జలాశయంలో డెడ్ స్టోరేజీ నుంచి నీటిని తరలించేందుకు అత్యవసర పంపింగ్ చేయడానికి అవసరమైన ప్రక్రియ మొదలు పెట్టారు. అదే విధంగా అవసరం ఆధారంగా ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాల నుంచి అదనపు జలాలను తరలించేందుకు సమాయత్తమవుతోంది. ఇవే కాకుండా సింగూరు, మంజీరా జలాశయాల్లో సంతృప్తికరమైన నీటి నిల్వలు ఉన్నాయని, తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బంది ఉండదని జలమండలి చెబుతోంది.
water supply and sewerage board on drinking water :ఇదిలా ఉండగాహైదరాబాద్‌లో నీటిని తరలించే ట్యాంకర్లకు గతంలో కంటే భారీగా డిమాండ్ పెరుగుతోంది. జలమండలిలోని 24 డివిజన్లలో పటాన్‌చెరు, శేరిలింగంపల్లి, ఎస్సార్ నగర్, కూకట్‌పల్లి, మణికొండ, నిజాంపేటతో పాటు మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లో ట్యాంకర్లకు అధిక డిమాండ్ ఏర్పడింది. గ్రేటర్ వ్యాప్తంగా 72 ఫిల్లింగ్ కేంద్రాల పరిధిలో సుమారు 650 ట్యాంకర్లు రోజూ తిరుగుతున్నాయి. డిమాండ్‌కు అనుగుణంగా ట్యాంకర్లను సరఫరా చేయలేక జలమండలి తలపట్టుకుంటోంది. రాత్రి వేళల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండటం, పగటిపూట వాహనాల రద్దీ కారణంగా నీటి సరఫరాలో జాప్యం జరుగుతోంది.