Outer Ring Road : మహా నగరానికి అవుటర్ రింగ్ రోడ్డు ఓ మణిహారమనే చెప్పాలి. అలాంటి ఓఆర్‌ఆర్‌పై వ్యర్థాలు కుప్పలు తెప్పలుగా పడి ఉంటున్నాయి. దీంతో రహదారి వ్యర్థాల కుప్పగా మారుతోంది. దీనంతటికీ కారణం సర్వీసు రోడ్లు, మెయిన్ క్యారేజ్ వెంబడి పర్యవేక్షణ లేకపోవడమనే తెలుస్తోంది. పగలు, రాత్రి టిప్పర్లలో వ్యర్థాలను తెచ్చి సర్వీసు రోడ్ల వెంబడి పోస్తున్నారు. దీంతో వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. కొన్నిసార్లయితే ఓఆర్‌ఆర్ పైనుంచి కిందకు వచ్చే క్రమంలో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి.
హైదరాబాద్ మహా నగరం చుట్టూ 158 కి.మీ. మేర అవుటర్ రింగ్ రోడ్డు ఉంది. దీనికి సమాంతరంగా ఇరువైపులా సర్వీసు రోడ్లను నిర్మించారు. వీటి నుంచే జంక్షన్ల ద్వారా అవుటర్‌పైకి వెళ్లాలి. అలాగే కిందకు రావాలన్నా ఈ సర్వీసు లైన్లే ఆధారం. కానీ వీటి నిర్వహణ ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఓఆర్‌ఆర్ వెంబడి పలు ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టులు చేపట్టారు. వ్యాపార సంస్థలు, వాణిజ్య, గేటెడ్ కమ్యూనిటీలు, ఇతర నిర్మాణాలు, ఇలా చాలానే నిర్మాణం జరుగుతున్నాయి.
కోకాపేట, గండిపేట, వట్టినాగులపల్లి, ఖానాపూర్ తదితర ప్రాంతాల్లో పాత నిర్మాణాలను తొలగించి వాటి స్థానంలో కొత్త నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో వచ్చే వ్యర్థాలను సమీపంలోని ఓఆర్‌ఆర్ పరిసరాల్లో, ఓఆర్‌ఆర్ పక్కన, ఓఆర్‌ఆర్ సర్వీసు రహదారుల వెంట కుప్పలుగా పోసేస్తున్నారు. దీంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.
భారీగా టోల్ ఆదాయం : అవుటర్ రింగ్ రోడ్డు నిర్వాహణ ఎలా ఉన్నా టోల్ ఆదాయం మాత్రం భారీగానే సంపాదిస్తున్నారు. నెలకు టోల్ వసూలు చేయడం ద్వారానే రూ.60 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. నిత్యం 1.5 లక్షల వాహనాలు ఓఆర్‌ఆర్‌పై ప్రయాణిస్తాయి. నగరానికి వచ్చే అన్ని జాతీయ, రాష్ట్ర రహదారులతో ఓఆర్‌ఆర్‌కు అనుసంధానం ఉంది. ముఖ్యంగా ఓఆర్‌ఆర్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దినా, నిర్వహణపై సక్రమంగా దృష్టి పెట్టడం లేదనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ఇప్పటికే ఓ ప్రైవేటు సంస్థ 30 ఏళ్లకు ఓఆర్‌ఆర్‌ను లీజుకు తీసుకుంది. దీంతో ఆ సంస్థ ప్రధాన క్యారేజ్‌వే వరకు మాత్రమే నిర్వహణను చూస్తోంది. ఎంతో కీలకమైన సర్వీసు రహదారుల నిర్వహణ లేకపోవడంతో అవి డంపింగ్ యార్డులను తలపిస్తున్నాయి. హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులు దృష్టి సారించి, సమస్య లేకుండా చేయాలని వాహనదారులు కోరుతున్నారు.
వాహనదారులకు అలర్ట్ - ఓఆర్ఆర్ టోల్ ఛార్జీలు పెంపు - TOLL CHARGES HIKE 2024