CM Revanth Reddy on Future Plan for Drinking Water : హైదరాబాద్ మహానగరంలో తాగునీటి అవసరాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. 2050 నాటికి పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా తాగునీటి ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జలమండలి అధికారులను ఆదేశించారు. జలమండలి బోర్డు ఛైర్మన్ హోదాలో తొలిసారిగా జలమండలి అధికారులతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన ఈ సమావేశానికి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మున్సిపల్, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శలు దానకిషోర్, రాహుల్ బొజ్జా, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి సహా సంబంధిత ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ప్రస్తుతం నగరంలో జరుగుతున్న తాగునీటి సరఫరా, డిమాండ్, జలమండలి ఆర్థిక పరిస్థితిని సీఎం రేవంత్‌రెడ్డి అడిగి తెలుసుకున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా 9 వేల 800 కిలో మీటర్ల నెట్వర్క్ ద్వారా 13.79 లక్షల కనెక్షన్లకు తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు సీఏంకు నివేదించారు. మంజీరా, సింగూరు, గోదావరి, కృష్ణా నుంచి నీటి సరఫరా జరుగుతోందని, ప్రస్తుతం గోదావరి ఫేజ్ 2 ద్వారా మరింత నీటిని ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్‌కు తీసుకొచ్చే ప్రాజెక్టు రూపకల్పన జరిగినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వివరించారు. అయితే ఆ ప్రాజెక్టు కోసం మల్లన్నసాగర్ లేక కొండపోచమ్మ సాగర్‌ను నీటి వనరుగా ఎంచుకునే అంశంపై సీఎంతో అధికారులు చర్చించారు.
సొంత ఆదాయాన్ని పెంచుకోవాలని ఆదేశం : కన్సల్టెన్సీ ఏజెన్సీలు ఇచ్చిన నివేదికలు, నీటి లభ్యత, లిప్టింగ్ వ్యయాన్ని దృష్టిలో పెట్టుకొని మల్లన్నసాగర్ నుంచే తాగునీటి సరఫరా చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. అలాగే గతంలో ప్రతిపాదించిన 15 టీఎంసీలకు బదులు నగర అవసరాల దృష్ట్యా 20 టీఎంసీలు సరఫరా చేసుకునేలా చేసిన మార్పులకు ఆమోదం తెలిపారు. జలమండలి తమ సొంత ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను ఆన్వేషించాలని, అందుకు అనుసరించాల్సిన విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు.
జలమండలి కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు అవసరమయ్యే నిధులను సమకూర్చుకోవాలని, తక్కువ వడ్డీతో రుణాలు తెచ్చుకునే ప్రత్యామ్నాయాలపై ఎంచుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. అందుకు వీలుగా ప్రాజెక్టు డీపీఆర్‌లు తయారు చేయాలని ఆదేశించారు. నగరంలోని మంజీర పాత పైపులైన్లకు ప్రత్యామ్నాయంగా అధునాతన లైన్లు నిర్మించేలా కొత్త ప్రాజెక్టు చేపట్టాలని సీఎం రేవంత్ ఆదేశించారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జల జీవన్ మిషన్ ద్వారా నిధులు తెచ్చుకునేందుకు వీలుగా డీపీఆర్‌లు సిద్ధం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి జలమండలి ఉన్నతాధికారులను సూచించారు.
మీ వాటర్ CAN నెంబర్ మర్చిపోయారా? - ఇలా క్షణాల్లో తెలుసుకోండి!