Heavy Vehicles Smuggling Gang Arrested in Warangal : తెలుగు రాష్ట్రాల్లో భారీ వాహనాలను చోరీ చేసి తుక్కు కింద విక్రయిచడంతో పాటు విదేశాలకు తరలిస్తున్న దోపిడీ ముఠాను వరంగల్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ బారీ వివరాలను వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా తుర్కలకుంట గ్రామానికి చెందిన వరి కుప్పల దశరథ్(ప్రస్తుతం అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలోని తుర్కయంజాల్‌లో నివాసం), మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టకు చెందిన కౌశెట్టి రాకేశ్, పెద్దపల్లి జిల్లా వసంత్‌నగర్‌కు చెందిన దుర్గం సందాన్, హైదరాబాద్ పాతబస్తీకి చెందిన మహ్మద్ జబ్బార్ ఓ ముఠాగా ఏర్పడ్డారు.
Vehicle Theft Gang Arrest Warangal : నిందితుడు దశరథ్ జిల్లాలు, రాష్ట్రాలవారీగా వాట్సప్ గ్రూపులు తయారు చేశాడు. ఫైనాన్స్ కిస్తీ డబ్బులు కట్టలేని ఎక్స్‌కవేటర్లు, కార్లు, లారీలు, క్రేన్లు తదితర భారీ వాహనాలను కొంటామంటూ వాటిలో ప్రకటనలు ఇచ్చేవాడు. అలాంటివారు అతడిని సంప్రదించేవారు. వారిని ముఠా సభ్యులు స్వయంగా కలిసి మొదట కొంత డబ్బు ఇచ్చేవారు. వాహనాల కొనుగోలు పత్రం రాసుకునేవారు. వాహనం, పత్రాలు తీసుకుని రెండు, మూడు నెలల్లో మిగతా సొమ్ము ఇస్తామని చెప్పి అక్కడినుంచి ఉడాయించేవారు.
ఇలా తెలంగాణవ్యాప్తంగా రూ.2 కోట్ల విలువైన 8 కొత్త లారీలను చోరీచేశారు. వాటిని తుక్కు కింద రూ.32 లక్షలకు విక్రయించారు. తమ మాటలను నమ్మనివారి వాహనాలను దొంగిలించి విక్రయించడం లేదా తుక్కుగా మార్చడం చేసేవారు. 5 ఎక్స్‌కవేటర్లను దశరథ్ ముఠా ముంబయికి తరలించింది. ముంబయికి చెందిన మరో ముఠాతో కలిసి కంబోడియా, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా దేశాలకు తరలించినట్లు మట్టెవాడ ఠాణా పోలీసులు గుర్తించారు.
ఇలా వెలుగులోకి : ఈ నెల 5న వరంగల్‌లో ఓ కారు యజమానిపై దశరథ్ ముఠా దాడి చేసింది. అనంతరం అక్కడి నుంచి వాహనంతో ఉడాయించింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగానే దశరథ్ ముఠా బాగోతం బయటపడింది. వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాలతో డీసీపీ బారీ నేతృత్వంలో నాలుగు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఏపీలోని అనంతపురంతో పాటు ఖమ్మం, హైదరాబాద్‌లలో ముఠా సంచరిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు.