Villagers left village one day in Nalgonda District : నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం అమ్మనబోలు గ్రామంలోని ప్రజలు ఓ వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. ఊరికి కీడుపట్టుకుందనే అనుమానంతో ఓ రోజంతా గ్రామాన్ని విడిచి వ్యవసాయ బావులు, చెట్ల కిందకు చేరి వంటచేసుకున్న అక్కడే సేదతీరారు. ఈ విధంగా చేస్తే గ్రామంలో మరణాలు తగ్గుతాయని గ్రామస్థులు పేర్కొంటున్నారు.
గత రెండు నెలలుగా అమ్మనబోలు గ్రామంలో వివిధ కారణాలతో వరుస మరణాలు సంభవిస్తుండటంతో గ్రామం ఉలిక్కిపడింది. ఊరి పెద్దలంతా మాట్లాడుకుని ఒక రోజంతా ఊరిలో అన్ని ఇళ్లను ఖాళీ చేసి ఇంట్లో పొయ్యి వెలగకుండా ఉండాలని నిర్ణయించారు. అందుకు గ్రామస్థులు వనమహోత్సవంలా వ్యవసాయ బావుల వద్ద, చెట్లకింద వంటచేసుకుని భోజనం చేసి సాయంత్రం వరకు ఊరి బయటే ఉండాలని నిశ్చయించుకున్నారు. ఫలితంగా ఓ రోజు ముందునుంచే గ్రామంలో వాణిజ్య సముదాయాలు, స్కూళ్లు, గ్రామ పంచాయతీ, వైన్సు ఇలా అన్ని మూసివేయాలని సమాచారం ఇవ్వడంతో గ్రామం మొత్తం నిర్మానుష్యంగా మారింది.
సుమారు 4000 ఓట్లు ఉండే ఈ గ్రామంలో, గత రెండు నెలల నుంచి ఒకరు తర్వాత మరొకరు వివిధ కారణాలతో చనిపోవడంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. దీంతో పెద్దమనుషులు చెప్పిన విధంగా గ్రామంలో చిన్నా పెద్దా వృద్ధులతో సహా అందరినీ గ్రామం వెలుపల ఉన్న వ్యవసాయ బావి వద్దకు చెట్ల కిందికు చేరి, సాయంత్రం ఐదు గంటల తర్వాత గ్రామంలోని బొడ్రాయి వద్ద నిప్పు ఇస్తే అది తీసుకెళ్లి ఇంట్లో వెలిగించుకోవాలని ఆ తర్వాత నుంచి యథావిధిగా గ్రామంలో రాకపోకలు జరుగుతాయని గ్రామస్ధులు చెబుతున్నారు.