Vijayawada YSRCP Leader Irregularities : విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ నుంచి తడి బూడిద వెలువడుతుంది! స్థానిక యువకులు ఈ తడిబూడిదను ఉచితంగా తీసుకెళ్లి ఇటుకబట్టీలు, ఫ్లైయాష్ బ్రిక్స్ తయారు చేసేవాళ్లకు అమ్ముకునే వారు. 2019 తర్వాత ఓ మంత్రి కన్ను దీనిపై పడింది. వీటీపీఎస్(VTPS) ట్రక్కు టెర్మినల్ పక్కనే తన టిప్పర్లను పెట్టించారు. వాటికే అక్కడ బూడిదను నింపుతారు. బూడిదను జాతీయ రహదారి నిర్మాణంలో వాడొచ్చని కేంద్రం గతేడాది ఆదేశాలిచ్చాక ఆయన పంట పండింది. గతంలో 10టన్నుల లారీ బూడిద 3వేలకు అమ్మితే ఇప్పుడు 10వేలవరకూ అమ్ముకుంటున్నారు. మంత్రిగారి కన్ను పడ్డాక తామంతా రోడ్డున పడ్డామని బూడిద రవాణా యాజమాన్యాలు కలెక్టర్‌కూ ఫిర్యాదు చేశారు. అయినా ఫలితంలేదు. ఇదొక్కటే కాదు మట్టి, ఇసుక రవాణాలోనూ ఆయన కోట్లు కొల్లగొడుతున్నారు.
YSRCP Leader :అక్రమార్జన రుచిమరిగిన ఆయన ప్రతిపనికీ ఓ రేటుపెట్టారు. ట్రాన్స్‌ఫార్మర్ వేయాలంటే కమీషన్.! రోడ్డు మరమ్మతు చేయాలంటే కమీషన్.! చివరకు ప్రజలకు అవసరమైన పనులు ప్రభుత్వానికి ప్రతిపాదించాలన్నా కమీషన్.! విరాళాల పేరుతో బలవంతపు వసూళ్లు. ఖర్చుల పేరుతో కమీషన్లను గుంజడం, చేపల చెరువుల నుంచి భూకబ్జాల వరకు ఆయన చేయని దందా అంటూ లేదు. ఇసుక తవ్వకాలకు అడ్డగోలుగా వేలం నిర్వహించి మండలానికి 50 లక్షల రూపాయల వరకు వసూలు చేశారు.
చదువులమ్మ ఒడిలో సమస్యల వ్యథ - విద్యార్థులను వెంటాడుతున్న వసతుల లేమి!
నియోజకవర్గంలో ఆ మంత్రి నేరుగా ముడుపులు స్వీకరించరు. పీఏ(PA) ద్వారా దండుకుంటుంటారు. ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు 2 లక్షల నుంచి 4 లక్షల వరకూ వసూలు చేస్తారు. స్వపక్షం, విపక్షం అనే పక్షపాతం ఆయనకుండదు.! ఎకరాకు 20 వేల రూపాయలు చెల్లిస్తే చాలు అధికారులతో సంబంధం లేకుండా ఇష్టారాజ్యంగా చేపల చెరువులు తవ్వుకునే లైసెన్స్ ఇచ్చేస్తారు.! మంత్రి కార్యాలయానికి ముట్టే ముడుపులే అక్రమ నిర్మాణాలకు అనుమతులు. పట్టాదారు పాసుపుస్తకాల జారీకి ఎకరానికి 20 వేలు ధర నిర్ణయించారని రైతులు గుండెలు బాదుకునే పరిస్థితి.
మంత్రి వస్తే లేచి నిలబడే సంస్కారం లేదా? : భూమి కొనుగొలును వరంగా మార్చుకున్నారా మంత్రి. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని ఓ పట్టణంలో జగనన్న లే-అవుట్ కోసం ప్రభుత్వం 40 ఎకరాలు కొనుగోలు చేసింది. మార్కెట్ ధరను పెంచి భూములు కొనిపించిన మంత్రి ఎకరాకు 5 లక్షల నుంచి 6 లక్షల వరకూ కమీషన్ వసూలు చేశారు. భూములిచ్చిన రైతులకు అందాల్సిన పరిహారం నుంచీ 2 కోట్లకు పైగా కమీషన్ దండుకున్నారు.! జలవనరుల శాఖ ఇంజినీర్లపై ఇష్టమొచ్చినట్లు విరుచుకుపడేవారాయన. 'మంత్రి వస్తే లేచి నిలబడే సంస్కారం లేదా?' అంటూ మండిపడేవారు. తన నియోజకవర్గంలో జల వనరుల శాఖకు సంబంధించి 25 కోట్ల రూపాయల విలువైన పనులు చేపట్టి అందులోంచి 25 శాతం కమీషన్ తీసుకున్నారు. మడ భూముల్ని ఆక్రమించి చెరువులుగా మార్చేశారు. ఈ వ్యవహారంలో కోట్లు చేతులు మారాయనే ఆరోపణలున్నాయి.