Kirana Shop Owner Murder IN AP :ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ బృందావన్ కాలనీలో నడిరోడ్డుపై ఓ యువకుడు కిరాణా షాపు వ్యాపారిని దారుణంగా హత్య చేశాడు. కన్న కుమార్తె ఎదురుగానే కర్కశంగా హతమార్చాడు. భవానీపురంలోని చెరువు సెంటర్‌కు చెందిన కె.శ్రీరామచంద్రప్రసాద్ (56) బృందావన్ కాలనీలో కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. నిత్యం భవానీపురం నుంచి రాకపోకలు సాగిస్తున్నాడు.
ఆయన కుమార్తె ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. విద్యాధరపురానికి చెందిన గడ్డం శివమణికంఠ విజ్ఞాన్ విహార్ స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. మణికంఠకు ఇన్‌స్టాలో శ్రీరామచంద్రప్రసాద్ కుమార్తె పరిచయం ఏర్పడింది. నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
తన కుమార్తె వెంటపడవద్దని తండ్రి హెచ్చరిక :ఈ విషయం తెలిసిన శ్రీరామచంద్రప్రసాద్ కుమార్తెను హెచ్చరించాడు. బాగా చదువుకుని జీవితంలో స్థిరపడాలన్నాడు. తన కుమార్తె జోలికి రావద్దని మణికంఠను హెచ్చరించాడు. దీంతో కొద్దిరోజులుగా ఆమె అతడిని పక్కనపెట్టింది. పెళ్లి చేసుకోవాలని మణికంఠ చేసిన ప్రతిపాదనను తిరస్కరించింది. దీనిపై శ్రీరామచంద్రప్రసాద్ కొంతమందిని తీసుకుని మణికంఠ ఇంట్లో పంచాయితీ పెట్టాడు. ఆ తర్వాత మణికంఠ ఇంట్లో రోజూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మణికంఠ తల్లి గురువారం ఇల్లు విడిచి వెళ్లిపోయింది. దీంతో మణికంఠ పగ పెంచుకున్నాడు.
కత్తితో దారుణ హత్యకు పాల్పడిన యువకుడు :గురువారం శ్రీరామచంద్రప్రసాద్ కుమార్తెను తీసుకుని బృందావన్ కాలనీలోని కిరాణా షాపునకు వచ్చాడు. రాత్రి 9 గంటల సమయంలో షాపు మూసేసి ఇద్దరూ ఇంటికి బయల్దేరారు. పగతో రగిలిపోతున్న మణికంఠ కత్తి తీసుకుని బృందావన్ కాలనీకి వచ్చాడు. షాపునకు 100 మీటర్ల దూరంలో ఉన్న ఓ చెట్టు కింద నిలబడ్డాడు. తండ్రీకుమార్తెలు స్కూటర్‌పై వస్తుండగా, ఎదురుగా వెళ్లి బైకుతో ఢీ కొట్టాడు. కిందపడిపోయిన శ్రీరామచంద్రప్రసాద్‌పై కత్తితో వేటు వేశాడు.