Venkaiah Naidu Attended for Launchpad Inauguration in Bits Pilani : దేశంలో ప్రతిభావంతులకు కొదవలేదని, సిలికాన్ వ్యాలీ నుంచి వాల్ స్ట్రీట్, దుబాయ్ నుంచి షాంగై వరకు భారత సీఈవోలు తమ నాయకత్వ లక్షణాలు, వ్యాపార కార్యదక్షతతో ప్రపంచంలో తమదైన ముద్ర వేస్తున్నారని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. చదువు కేవలం విజ్ఞాన సముపార్జున కోసం మాత్రమే కాదని, మంచి నడవడిక, విలువలు, సమాజం పట్ల బాధ్యత పెంచే సాధనంగా ఉండాలని స్పష్టం చేశారు. హైదరాబాద్ బిట్స్ పిలాని ఆవరణలో లాంచ్ ప్యాడ్ పేరిట నిర్వహించిన ఎంట్రప్రిన్యూరియల్(Entrepreneurial) సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కీలక పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లోకి అడుగు పెట్టాలనుకుంటున్న నవతరం ఔత్సాహికులకు లాంచ్ ప్యాడ్(Launchpad)ఒక సువర్ణ అవకాశమని వెంకయ్యనాయుడు చెప్పారు. సృజనాత్మక ఆలోచనలు పంచుకునేందుకు అనుభవజ్ఞులు, పారిశ్రామిక దిగ్గజాల నుంచి నేర్చుకునేందుకు ఇది అద్భుతమైన వేదిక అని స్పష్టం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రగతి పథంలోకి దూసుకుపోవడానికి మరింత గొప్ప పరివర్తన రావడానికి తదుపరి తరం పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు సంసిద్ధులు కావాలని తాను ఆశావహ దృక్పథంతో వేచి చూస్తున్నాని తెలిపారు. ఈ సమాజం, దేశం, మానవాళికి మేలు చేసేందుకు ప్రస్తుత సవాళ్లు ఎదుర్కొనేందుకు కోట్ల మంది సహచర పౌరులకు అవకాశాలు కల్పించేందుకు ప్రతిభ, నైపుణ్యాలు ఉపయోగించుకోగల సమర్థత ప్రతి ఒక్కరికీ ఉందన్నారు.
Venkaiah Naidu about Entrepreneurial Summit in Bits Pilani : మన దేశ దశ దిశలు మార్చే, రాబోయే తరాలకు అద్భుతమైన భవిష్యత్తును సిద్ధం చేసే శక్తి సామర్థ్యాలు తమకు ఉన్నాయని విద్యార్థులను ఉద్దేశిస్తూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. 2020లో 5.1 శాతంగా ఉన్న ఎంట్రప్రెన్యూర్షిప్(Entrepreneurship) 2024 నాటికి 14.4 శాతానికి పెరిగిందన్నారు. ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించే సత్తా, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే సత్తా, దేశంలో సానుకూల సామాజిక పరివర్తన తీసుకొచ్చే సత్తా ఈ రంగానికి ఉందని స్పష్టం చేశారు.