Hyderabad to Vijayawada Traffic Stopped : రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద పాలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పాలేరు వాగు ప్రవాహానికి జాతీయ రహదారిపై నీరు చేరింది. దీంతో హైదరాబాద్-విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో సూర్యాపేట ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ సూర్యాపేట మీదగా ఖమ్మం, విజయవాడ వెళ్లే ప్రజలు ప్రయాణం వాయిదా వేసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్లే మార్గంలో నాయకినిగూడెం వద్ద పాలేరువాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోందని తెలిపారు. రక్షణ చర్యల్లో భాగంగా ఈ మార్గంలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిపివేసినట్లు ఎస్పీ చెప్పారు.
హైదరాబాద్ పోలీసులు సూచనలు : తెలుగు రాష్ట్రాల్లో వరదల దృష్ట్యా నగర ప్రజలకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు చేశారు. చిల్లకల్లు, నందిగామలో జాతీయ రహదారి 65పై వరద, ఏపీ-తెలంగాణ సరిహద్దు రామాపురం క్రాస్ వద్ద వంతెన కూలిపోయిన ఘటన, సూర్యాపేట ఖమ్మం రహదారిపై పాలేరు పొంగటం వంటి ఘటనల దృష్ట్యా సూచనల నగర ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితిల్లో వెళ్లాలనుకుంటే విజయవాడ వెళ్లేవారు చౌటుప్పల్, నార్కెట్‌పల్లి, నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా వెళ్లాలని సూచించారు.
ఖమ్మం వెళ్లే వారు చౌటుప్పల్, నార్కెట్‌పల్లి, అర్వపల్లి, తుంగతుర్తి, మరిపెడ బంగ్లా మీదుగా వెళ్లాలని సూచిస్తున్నారు. ప్రయాణ సమయంలో అత్యవసర పరిస్థితి ఎదురైతే 9010203626 అనే నెంబర్‌కు ఫోన్ చేయాలని తెలిపారు. సూర్యాపేట ఎస్పీ, ఖమ్మం కమిషనర్ల నుంచి వచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ సూచనలు జారీచేశారు.