Vehicles Stuck at Kodada due to Flood : వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాల వల్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయ. జాతీయ రహదారిపై వరద నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో ప్రయాణికులకు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధిక వర్షాల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ వద్ద వాగు పొంగడంతో హైవేపైకి పెద్ద ఎత్తున వరద నీరు చేరింది.
ఈ సందర్భంగా సూర్యాపేటలోని కోదాడ టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో గంటల కొద్ది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో అధికారులు హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే వాహనాలను ఖమ్మం వైపు మళ్లించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే వాహనాలు నార్కట్‌పల్లి-అద్దంకి వైపు మళ్లించారు.
జలదిగ్భందంలో కాజ టోల్‌ప్లాజా : భారీ వర్షాలకు గుంటూరు జిల్లాలో 16వ నంబరు జాతీయ రహదారి జలదిగ్భందంలో చిక్కుకుంది. విజయవాడ నుంచి గుంటూరు వెళ్లే మార్గంలో భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. కాజ టోల్‌ప్లాజా వద్ద పరిస్థితి దారుణంగా మారింది. మోకాళ్ల లోతుకుపైగా వరద నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నీళ్లలో కార్లు, బైకులు ఆగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.