Auto Bus Accident In Anantapur : ఒక్కరోజు కూలికి పోతే రెండు రోజులు కుటుంబం ఆకలి తీరుతుందని భావించిన వారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అరటి తోటలో పనులు ముగించుకుని ఆటోలో స్వస్థలానికి వెళ్తుండగా ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం 8 మంది ఊపిరి తీసింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పుట్లూరు మండలం ఎల్లుట్లలో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.
ఆటోను ఢీ కొట్టిన బస్సు : ఏపీలోని అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాసుపల్లి క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుట్లూరు మండలం ఎల్లుట్ల నుంచి 60 కిలోమీటర్ల దూరంలోని తలగాసుపల్లిలో అరటి తోటలో పని చేసేందుకు 12 మంది కూలీలు ఆటోలో వెళ్లారు. తోటలో పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఆర్టీసీ బస్సు మృత్యువు రూపంలో కబళించింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో ఆటోను వేగంగా ఢీ కొట్టడంతో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఒకరు అనంతపురం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో, మరో ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఊపిరి వదిలారు. ప్రమాదంలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను అనంతపురంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మృతుల బంధువుల రోదనలతో ఆస్పత్రి ప్రాంగణం ఆవేదన భరితంగా మారింది.
8 మంది కూలీలు మృతి : ఎల్లుట్లలో పనులు తగ్గిపోవడంతో ఎస్సీ కాలనీలో చాలా మంది వ్యవసాయ కూలీలు ఇంటి వద్దనే ఉంటున్నారు. అరటి తోటల్లో బాగా పని చేసే నైపుణ్యం సొంతం చేసుకున్న ఎల్లుట్ల గ్రామ కూలీలను గార్లదిన్నె మండలం తలగాసుపల్లిలో అరటి తోటలో పని చేయడానికి ఓ వ్యక్తి గంపగుత్తగా ఒప్పందం చేసుకున్నాడు. అరవై కిలోమీటర్ల దూరంలోని తలగాసుపల్లికి 12 మంది కూలీలను ప్రత్యేక ఆటో మాట్లాడుకొని తీసుకెళ్లాడు. తెల్లవారుజామునే తలగాసుపల్లికి బయలుదేరిన కూలీలంతా, మధ్యాహ్నం 12 గంటలకు తోటలో పని ముగించుకున్నారు. కూలీలంతా తిరిగి ఎల్లుట్లకు వెళ్లే క్రమంలో వారు ప్రయాణిస్తున్న ఆటోను 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో మొత్తం 8 మంది మృతి చెందారు.
మృతులంతా ఒకే వీధికి చెందిన వారు కావడంతో గ్రామస్థులు శోకసంద్రంలో మునిగారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. ఆసుపత్రిలో మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను మంత్రి సవిత, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్‌లు పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఐవరీ కోస్ట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం - 21 మంది మృతి, 10 మందికి తీవ్రగాయాలు
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - లారీని ఢీకొన్న కారు - ఆరుగురు మృతి