తెలంగాణ

telangana

ETV Bharat / state

వైకుంఠ ఏకాదశికి తిరుమల వెళ్లలేకపోతున్నారా? - తెలంగాణలోని ఈ ఆలయాల్లోనూ ఉత్తర ద్వార దర్శనం! - VAIKUNTA EKADASHI 2025

జనవరి 10న ముక్కోటి ఏకాదశి - రాష్ట్రంలోని ఈ ఆలయాల్లోనూ వైకుంఠ ద్వార దర్శనం!

VAIKUNTA EKADASHI 2025 SIGNIFICANCE
Vaikunta Ekadashi 2025 (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 17 hours ago

Vaikunta Ekadashi 2025 :సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే శుద్ధ ఏకాదశినే "వైకుంఠ ఏకాదశి/ముక్కోటి ఏకాదశి" అని పిలుస్తారు. పుణ్యతిథి కావడం వల్ల దీన్ని మోక్షద ఏకాదశిగానూ పేర్కొంటారు. అంతేకాదు, ఈ పవిత్రమైన రోజున మహావిష్ణువు గరుడ వాహనం అధిరోహించి మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి, భక్తులకు దర్శనమిస్తాడని నమ్మకం. అందుకే దీనికి "ముక్కోటి ఏకాదశి"అని పేరు వచ్చినట్టు అష్టాదశ పురాణాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా ఈ పవిత్రమైన రోజున కలియుగ ప్రత్యక్షదైవం వెంకటేశ్వరస్వామిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదని, మోక్షం సిద్ధిస్తుందని వేదవాక్కు. మరి, అంతటి పవిత్ర పర్వదినం 2025, జనవరి 10న వస్తోంది.

ఈ నేపథ్యంలోనే వైష్ణవాలయాలలో ఉన్న వైకుంఠ ద్వారాలు తెరుచుకొని ఉంటాయని, ఉత్తర ద్వార దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ ఎత్తున క్యూ లైన్లలో వేచి ఉంటారు. ముఖ్యంగా ఎక్కువ మంది తిరుమల వెళ్లడానికి సిద్ధమవుతుంటారు. అయితే, అందరికీ వెళ్లడం కుదరకపోవచ్చు. అలాంటి వారు తెలంగాణలోని ఈ దేవాలయాలలో కూడా విష్ణుమూర్తిని ఉత్తరద్వారం నుంచి దర్శించుకోవచ్చు. మరి, ఆ ఆలయాలేంటి? అవి ఎక్కడెక్కడ ఉన్నాయి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజున బ్రాహ్మి ముహూర్తంలో లేచి స్నానమాచరించి వైష్ణవ ఆలయాలను సందర్శిస్తుంటారు భక్తులు. అయితే, ఉత్తరద్వార దర్శనం కోసం తిరుమల వెళ్లలేని వారు రాష్ట్రంలోని ఈ ఆలయాలకు వెళ్లవచ్చు.

  • అందులో మొదటగా చెప్పుకోవాల్సింది హైదరాబాద్ సమీపంలోని జియాగూడ రంగనాథ స్వామి ఆలయం. ఇక్కడ తిరుమల తరహాలో అంతే వైభవంగా ఐదు రోజులపాటు వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగవైభవంగా నిర్వహిస్తుంటారు. ఏకంగా 400 ఏళ్లుగా ఉత్తర ద్వార దర్శనం అందుబాటులో ఉంది! కాబట్టి ఈ దేవాలయానికి వెళ్లినా మీరు విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవచ్చు.
  • వైకుంఠ ఏకాదశి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న ప్రముఖ దేవాలయం యాదాద్రిలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమివ్వనున్నారు. అలాగే, భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయంలోనూ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని స్వామివారిని ఉత్తరద్వారం ద్వారా దర్శనం చేసుకోవచ్చు.

జనవరి 10 ముక్కోటి ఏకాదశి - ఆ రోజున ఇలా పూజ చేస్తే మోక్షం కలుగుతుందట!

  • రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో కూడా వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తరద్వార దర్శనం చేసుకోవచ్చు. కాబట్టి, వీసా వేంకటేశ్వర స్వామిగా పేరొందిన ఈ ఆలయానికి వెళ్లినా విష్ణుమూర్తిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకోవచ్చు.
  • హైదరాబాద్​లోని అసెంబ్లీ సమీపంలో ఉన్న బిర్లా టెంపుల్​లో కూడా ఉత్తర ద్వారం ద్వారా వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. అలాగే, చిక్కడపల్లిలో కొలువైన చారిత్రక ప్రాశస్త్యం ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి గుడిలో కూడా వైకుంఠద్వార దర్శనం ఉంటుంది. అదేవిధంగా హిమాయత్ నగర్​లోని శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి టెంపుల్, జూబ్లీహిల్స్​లో కొత్తగా కొలువు దీరిన టీటీడీ వారి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయాల్లోనూ ముక్కోటి ఏకాదశి రోజు స్వామి వారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకోవచ్చు.
  • ఇవేకాకుండా తెలంగాణంలోని మరికొన్ని ప్రాచీన వైష్ణవ ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు, ఉత్తరద్వార దర్శనం చేసుకోవచ్చు.

ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి? అసలు విషయమేమిటంటే?

ABOUT THE AUTHOR

...view details