Vaasanthi of Ananthapur Bagged 50th Rank in Civil Services : పెళ్లి చేసుకోకుండా ఇంకెన్నాళ్లు చదువుతావంటూ తెలిసినవారు సలహాలిస్తున్నా వారి మాటలను లక్ష్యపెట్టలేదు ఈ యువతి. గమ్యాన్ని చేరుకోవాలనే ఈమె పట్టుదల ముందు అవన్నీ చిన్నబోయాయి. ఆరేళ్ల పాటు వైఫల్యాలకు ఎదురీది చివరికి అనుకున్న లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పుడు తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టావంటూ విమర్శించిన వారి నోటితోనే ప్రశంసలు అందుకుంటోంది.
ఉద్యోగం చేస్తూనే ఐఎఫ్‌ఎస్ సాధించిన వాసంతిది శ్రీసత్యసాయి జిల్లాలోని గౌనివారిపల్లి. తండ్రి గోవిందరెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేసి రిటైరయ్యారు. తల్లి ఉషారాణి. హైస్కూల్ వరకూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకుంది వాసంతి. ఫార్మా-డి పూర్తికాగానే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎబీఏ కోర్సులో చేరింది. తర్వాత యూనివర్సిటీలో పరిచయమైన స్నేహితుల ప్రోత్సాహంతో యూపీఎస్సీ కోసం సన్నద్ధం కావటం మొదలుపెట్టింది.
'హైదరాబాద్ యూనివర్సిటీలో చేరాక సివిల్స్ సాధించాలనే లక్ష్యం మరింత బలపడింది. స్నేహితులు ఇచ్చిన ధైర్యంతో సాధన ప్రారంభించినా లక్ష్యాన్ని చేరేందుకు ఆరేళ్లకు పైగా నిరీక్షించాను. 2017 నుంచి సివిల్స్‌తో పాటుగా ఏపీపీఎస్సీ (APPSC) పరీక్షలకూ ఒకేసారి సన్నద్ధమయ్యాను. తొలి ప్రయత్నంలోనే గ్రూప్-1 ఉద్యోగావకాశం తృటిలో చేజారినా నిరాశపడలోదు. రెట్టించిన ఉత్సాహంతో కష్టపడి 2019లో పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం సాధించాను.'ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నావ్ కదా మళ్లీ సివిల్స్ కోసం ఇంత కష్టపడటం అవసరమా? అని కొందరు ప్రశ్నించేవారు అలాంటి సమయంలో తల్లిదండ్రులు, సహోద్యోగులే నాకు అండగా నిలిచారు. చివరికి 2023లో నిర్వహించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీసులో ఆలిండియా 50వ ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. -వాసంతి, ఐఎఫ్‌ఎస్ ర్యాంకర్