Cyber Fraud In Andhra Pradesh: మీకు ఏదైనా ఫోన్‌కాల్ లేదా యాప్ ద్వారా సులభంగా డబ్బులు వస్తాయని ఎవరైనా నమ్మించాలని చూస్తే అది సైబర్ నేరగాళ్ల పన్నాగమని గుర్తించండి. జాగ్రత్తగా ఉండండి. ఇటీవల కాలంలో ప్రతి ఫోన్‌కాల్‌కు ముందు ప్రజలను అప్రమత్తం చేస్తూ వినిపిస్తున్న హెచ్చరిక ఇది. కానీ సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలతో ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలపై అంతగా అవగాహన లేని గిరిజనులను లక్ష్యంగా చేసుకుని డబ్బులు కొల్లగొట్టారు. ఓ యాప్ పేరుచెప్పి రూ. లక్షలు కాజేసిన వ్యవహారం తాజాగా వెలుగుచూసింది.
'ఉద్యోగం సంగతి తర్వాత - ముందు ట్రేడింగ్ చెయ్' - మాయగాళ్ల ఉచ్చులో ఆ 2 గ్రామాలు
క్రీడా ఉత్పత్తుల పేరుతో నకిలీ యాప్: గతేడాది డిసెంబర్ నెల చివరి వారంలో మన్యం ప్రజలకు క్రీడా ఉత్పత్తుల విక్రయ సంస్థ పేరుతో ఓ నకిలీ యాప్ పరిచయమైంది. తక్కువ పెట్టుబడితో ఊహకందని ఆదాయం,ఇలాంటి అవకాశాలు మళ్లీమళ్లీ రానే రావంటూ సైబర్ నేరగాళ్లు వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా విస్తృత ప్రచారం చేశారు. తమకు అంతర్జాతీయ స్థాయిలో అనేక సంస్థలున్నాయని, 2033 వరకూ ఆన్‌లైన్ యాప్ ద్వారా వ్యాపార వ్యవహారాలు నిర్వహించుకునేందుకు తమకు అనుమతి ఉందని యాప్ నిర్వాహకులు నమ్మబలికారు. పెట్టుబడికి 24 గంటలు తిరగకముందే రిటర్న్స్ (తిరిగి చెల్లింపులు) ఇస్తామని ప్రకటించారు.
వెయ్యి మందితో వాట్సాప్ గ్రూప్: మొదట్లో పెట్టుబడి పెట్టినవారికి అనుమానం రాకుండా వెంటనే ఖాతాల్లో నగదు జమ చేశారు. దీంతో ఈ యాప్ తక్కువ సమయంలోనే ప్రజాదరణ పొందింది. దాదాపు మన్యంలోని అన్ని మండలాల్లో వెయ్యి ఖాతాదారులతో మూడు నుంచి నాలుగు వాట్సాప్ గ్రూప్‌లు సృష్టించి వ్యాపారాన్ని విస్తరించారు. ఉద్యోగులు, వ్యాపారులు, సాధారణ ప్రజలంతా వారి స్థాయికి తగ్గట్టు రూ. వెయ్యి నుంచి రూ. లక్షల వరకు డబ్బులు చెల్లించారు. అయితే సంక్రాంతి పండగ ముందు యాప్‌ను స్తంభింపజేయడంతో ఆన్‌లైన్‌లో పెట్టుబడులు పెట్టినవారు నిండా మునిగారు.
సైబర్ మోసాలు కోకొల్లలు: పాడేరులో ఉద్యోగులైన దంపతులు ఈనెల 9న రూ. 1.4 లక్షలు పెట్టుబడి పెట్టారు. తీరా చూస్తే రెండోరోజే యాప్ వ్యవహారాలను నిలిపివేసింది. ఓ ఉద్యోగి తన పేరు మీద , తన కుమారుడి పేరు మీద చెరో రూ. 50 వేలు యాప్ ద్వారా ప్రోడక్టులు కొనుగోలు చేశాడు. ఇలా మన్యంలో గల పదకొండు మండలాల నుంచి సుమారు మూడు వేల మంది వద్ద రూ.40 వేల నుంచి రూ.50 లక్షల వరకూ వసూలు చేసినట్లు తెలుస్తోంది.
అంకెలతో గారడీ: ఈ యాప్‌లో విక్రయించే క్రీడా సామగ్రిని ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూప్‌ల్లో ప్రదర్శిస్తూ ఉండేవారు. ఉదాహరణకు కేవలం రూ. 69 వేలు పెట్టుబడి పెట్టి ఓ క్రీడా వస్తువు కొనుగోలు చేస్తే రోజుకు రూ. 41 వేల చొప్పున 18 రోజులకు రూ. 7.45 లక్షల వరకూ చేతికందుతుందని నమ్మించారు. మరో ప్రోడక్టుకు రూ. 37 వేలు ఒకసారి పెట్టుబడి పెట్టగలిగితే 19 రోజులకు రోజుకు రూ. 18,500 చొప్పున రూ.3.51 లక్షలు బ్యాంకు ఖాతాలో జమవుతుందని, రూ. 23 వేలు పెట్టుబడితో 20 రోజులకు రోజుకు రూ. 9,200 చొప్పున రూ. 1.84 లక్షల వరకూ వస్తుందని విస్తృతంగా ప్రచారం చేశారు.
అప్రమత్తంగా ఉండాలన్న ఎస్పీ: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనేక రకాల ఫేక్ యాప్‌ల ద్వారా ప్రజలు బ్యాంకు ఖాతాల్లో దాచుకున్న డబ్బులను నేరగాళ్లు దోచుకుంటున్నారు. దీనిపై విచారణ జరిపిస్తామని అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ వెల్లడించారు.
సంక్రాంతికి బంపర్ ఆఫర్ అంటూ సోషల్ మీడియాలో లింక్స్ - నమ్మి క్లిక్ చేశారో!
నయా స్కామ్- మీ అకౌంట్లో ఫ్రీగా రూ.5వేలు డిపాజిట్- ఆనందంతో క్లిక్ చేస్తే అంతా ఖాళీ!