Minister Lokesh Meets Union Minister Ashwini Vaishnaw : రాష్ట్రాన్ని ఏఐ హబ్‌గా మార్చడంపై దృష్టిసారించిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. దిల్లీలో కేంద్ర మంత్రులను కలిసిన ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏపీలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే విశాఖకు పరిశ్రమలు తరలిరానున్నాయన్న ఆయన వాట్సప్ గవర్నెన్స్‌లో డేటా చౌర్యం నిరూపిస్తే 10 కోట్లు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. నేడు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఉక్కు శాఖ మంత్రి కుమార స్వామితో లోకేశ్ భేటీకానున్నారు.
మంత్రి నారా లోకేశ్ దిల్లీ పర్యటన కొనసాగుతోంది. కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌తో మంగళవారం భేటీ అయిన లోకేశ్ బడ్జెట్‌లో రాష్ట్రానికి చేసిన కేటాయింపులపై ధన్యవాదాలు తెలిపారు. అలాగే కేంద్ర బడ్డెట్‌లో ప్రకటించిన ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ కేంద్రాన్ని ఏపీలో నెలకొల్పాలని మంత్రి లోకేశ్ కోరారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో రాబోతున్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఏపీ సిద్ధంగా ఉందని దీనికి కేంద్రం నుంచి సంపూర్ణ మద్దతు కావాలని కోరారు. విశాఖలో తాము ఏర్పాటు చేయనున్న డేటాసిటీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
దేశంలో సాంకేతికరంగం పురుడుపోసుకుంటున్న సమయంలో ఆనాడు హైదరాబాద్‌లో చంద్రబాబు ఐటీని ప్రోత్సహించారని ఇప్పుడు ఏఐ రూపంలో మరో అవకాశం వచ్చిందని లోకేశ్ అన్నారు. ఇదే విషయం కేంద్రమంత్రికి వివరించినట్లు తెలిపారు. ప్రత్యేక ఆర్థిక మండళ్లు, డేటాసిటీలపై అశ్వనీవైష్ణవ్‌తో చర్చించామన్నారు. ఏపీ అన్ని రంగాల్లో ముందుండాలన్నదే చంద్రబాబు ఆశయమన్న లోకేశ్ దీనికి కేంద్ర సహకారం కోరామన్నారు. కేంద్రమంత్రి తమకు హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ప్రైవేట్ పెట్టుబడులు ఏపీ తీసుకురావడానికి కల్పించాల్సిన వాతావరణంపైనా కేంద్రమంత్రితో చర్చించినట్లు తెలిపారు.
డేటాసిటీల కోసం ప్రపంచవ్యాప్తంగా 300 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నారని అందులో 100 బిలియన్ డాలర్లు భారత్‌కు వచ్చే వీలుందని లోకేశ్ వెల్లడించారు. అందులో మెజార్టీ వాటా ఏపీకి రావాలన్నదే తమ ఆకాంక్షని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓర్వకల్లు, కొప్పర్తి నోడ్‌లు, ఈఎంసీ 1, 2, 3ల్లో పారిశ్రామిక వాతావరణాన్ని అభివృద్ధి చేయడంపైనా చర్చించామన్నారు. తన అమెరికా పర్యటనలో ఎదురైన అనుభవాలను సైతం వారికి వివరించినట్లు చెప్పారు. త్వరలోనే అశ్వనీవైష్ణవ్ ఏపీలో పర్యటించి విశాఖ, తిరుపతిల్లో తెలుగుదేశం హయాంలో చేపట్టిన పనులు పరిశీలించనున్నారని లోకేశ్ వెల్లడించారు.
రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో మంత్రి నారా లోకేశ్ భేటీ
విశాఖలో టీసీఎస్ కార్యకలాపాలు మరో 2 నెలల్లో ప్రారంభంకానున్నాయని దానికి శాశ్వత క్యాంపస్ ఏర్పాటు కోసం భూ అన్వేషణ జరుగుతోందన్నారు. కాగ్నిజెంట్‌పై త్వరలోనే ప్రకటన వెలువడుతుందన్నారు. వాట్సప్ గవర్నెన్స్ గురించి కేంద్ర మంత్రి వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లగా పౌర సేవలను అన్ని ప్లాట్‌ఫామ్‌లపై తీసుకురావాలని ఆయన సూచించినట్లు లోకేశ్ తెలిపారు.
వాట్సప్ గవర్నెన్స్‌పై ఇతర రాష్ట్రాలు సైతం ఆసక్తి చూపుతున్నాయన్నారు. వాట్సప్ గవర్నెన్స్‌లో డేటాచౌర్యం జరుగుతుందని వైఎస్సార్సీపీ నేతలు ఆసత్య ప్రచారం చేస్తున్నారని లోకేశ్ మండిపడ్డారు. గతంలోనూ టీడీపీ డేటా చౌర్యం చేసిందంటూ అబద్ధపు ప్రచారాలు చేసిన జగన్ ఐదేళ్లు అధికారంలో ఉండి కూడా నిరూపించలేకపోయారన్నారు. చేయని తప్పులకే దొంగ కేసులు పెట్టి చంద్రబాబును జైలుపాలు చేసిన వైఎస్సార్సీపీ నిజంగా తాను అప్పుడు తప్పు చేసి ఉంటే వదిలిపెట్టేవారా అని ప్రశ్నించారు.
పెట్టుబడుల వేటలో లోకేశ్ - పలు కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలు