Parvathipuram Manyam District Salur Lorry Industry in Loss : వేలాది మందికి జీవనాధారమైన లారీ పరిశ్రమ కుదేలవుతోంది. నష్టాల భారంతో వాహనాలు నడపలేక కార్మికులు, యజమానులు బతుకుజీవుడా అంటూ కాలం వెల్లదీస్తున్నారు. గ్రీన్ ట్యాక్స్, త్రైమాసిక పన్నులతో పాటు టైర్లు, విడిపరికరాలు, ఇంధన ధరలపై గత ప్రభుత్వం మోపిన పన్నుల భారం తీవ్ర ఇబ్బందుల పాల్జేసింది.
నిర్వహణ ఖర్చూ పెరగడంతో ఓనర్లు డ్రైవర్లుగా మారుతున్నారు. రాష్ట్రంలో సాలూరు లారీ మోటారు పరిశ్రమ (Salur Lorry Industry) ద్వితీయ స్థానంలో ఉంది. ఏటా 100 నుంచి 200 వరకు కొత్త లారీలు వచ్చేవి. గత అయిదేళ్లలో కనీసం 100 కూడా రాలేదు. పన్నుల భారం తగ్గించి లారీ పరిశ్రమను ఆదుకుంటామని మంత్రి లోకేశ్, వారాహి యాత్రలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. నేడు కూటమి ప్రభుత్వం రావడంతో వారి కష్టాలు తీరుతాయని ఆశతో ఎదురు చూస్తున్నారు.
మిగులు తక్కువ : సాలూరు లారీలు ఎక్కువగా విశాఖ, రాయపూర్ మధ్య సరకు రవాణా చేస్తుంటాయి. 12 చక్రాల లారీకి 25 టన్నుల సామర్థ్యం. ప్రస్తుతం రానూపోనూ టన్నుకు రూ. 2,700 చొప్పున రూ.67,500 వస్తుంది. ఇందులో డీజిల్ (500 లీటర్లు) రూ.49 వేలు, టోల్‌గేట్లకు రూ.4 వేలు, నిర్వహణ ఖర్చులు రూ.7 వేలు, ట్రాన్స్‌పోర్టు సాదర్లు రూ.2 వేలు కలిపి మొత్తం ఖర్చులు రూ.62 వేలు పోనూ రూ.5 వేలు మిగులుతోంది. నెలకు నాలుగు లోడ్లు వేస్తే రూ.20-30 వేలు వస్తుంది. వాహనం పాడైతే సొమ్మంతా బాగు చేసేందుకే అయిపోతుంది. దీనికితోడు ఫైనాన్స్ వాయిదాలు సకాలంలో చెల్లించక వడ్డీలు పడుతున్నాయి. కొందరు నడపలేక లారీలను ఫైనాన్స్ కంపెనీలకు అప్పగించేస్తున్నారు.
అవే కొనసాగుతున్నాయి : గత ప్రభుత్వంలో ఉన్నట్లే గ్రీన్‌ట్యాక్స్, లోడు ఎత్తు, ఓపెన్ డోర్ ఫైన్లు కూటమి సర్కారులో కొన సాగుతున్నాయి. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇచ్చే ఏటీఎస్ కేంద్రాలు దూరంగా ప్రైవేటు కంపెనీలకు అప్పగించింది. ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం దృష్టి సారించి, పరిష్కరించాలని కార్మికులు కోరుతున్నారు.
లారీలపై పెంచిన పన్నులు | ||
---|---|---|
పన్నులు | 2014-19 | 2019-24 (రూ.లలో) |
హరిత | 200 | 20,000 |
త్రైమాసిక | 7500 | 10,930 |
డోర్ ఓపెన్ | 1000 | 20,000 |
లోడ్ ఎత్తు | 1000 | 20,000 |
టోల్ గేట్లు | 2500 | 5,000 |
సాలూరు- విజయవాడ | ||
---|---|---|
టైర్లసెట్ | 32,000 | 49,500 |
బాడీ తయారీ | 2,50,000 | 3,50,000 |
విడి పరికరాలు | ముందుకంటే రెట్టింపు |
'మీరే మమ్మల్ని గట్టెక్కించాలి'- మంత్రిని కలిసిన లారీ యజమానుల సంఘం - LORRY OWNERS MEET MINISTER