Eluru Person Gets Jaivik Award 2025 : ప్రకృతి వ్యవసాయం చేయాలన్న ఆసక్తి అన్నదాతల్లో కనిపిస్తున్నా అవసరమైన జీవవనరుల కొరత ప్రతిబంధకంగా మారుతోంది. ఈ పరిస్థితిని ఏడేళ్ల క్రితమే గుర్తించిన ఆ రైతు ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాన్ని స్థాపించారు. వనరులు తయారుచేసి పంపిణీ చేయడమే కాకుండా దీనికి సంబంధించిన పద్ధతులపై కర్షకులకు ఉచితంగా శిక్షణ కూడా అందిస్తున్నారు. ఆయన సేవలకు తాజాగా జాతీయస్థాయిలో ఇకోవా సంస్థ అందించే జైవిక్ పురస్కారం దక్కింది.
రసాయనాల వినియోగం పెరిగి భూసారం తగ్గడంతోపాటు ఆహార ఉత్పత్తులు విషతుల్యంగా మారుతున్న తరుణంలో రైతులు సేంద్రియ సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. కొన్నేళ్లుగా పెట్టుబడిరహిత ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నా దానికి అవసరమయ్యే జీవవనరుల లభ్యత తక్కువగా ఉంటోంది. ఈ కొరతను గుర్తించిన ఏలూరు జిల్లా గుండుగొలనుకుంటకు చెందిన రైతు గోపాలకృష్ణమూర్తి 2018లోనే ప్రకృతి వనరుల కేంద్రాన్ని స్థాపించారు.
ఇందులో భాగంగా ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన అన్ని రకాల వనరులను తయారుచేసి రైతులకు అందిస్తున్నారు గోపాలకృష్ణమూర్తి. అస్త్రాలు, కషాయాలు, ద్రావణాలు, జీవామృతాలు పెద్ద మొత్తంలో తయారు చేస్తున్నారు. వీటిని ఏడాది పొడవునా సేంద్రియ సాగు చేసే అన్నదాతలకు అందిస్తున్నారు. ఏలూరు జిల్లాతోపాటు తెలుగు రాష్ట్రాలు, పక్క రాష్ట్రాలకూ ఎగుమతి చేస్తున్నారు. అంతే కాక తోటి కర్షకులకు ప్రకృతి సాగుపై అవగాహన కల్పిస్తున్నారు.
"శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ప్రకృతి వ్యవసాయ వనరుల శిక్షణ కేంద్రాన్ని 2018లో ప్రారంభించాను. సేంద్రియ సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. పురుగుమందుల వల్ల పంటల్లో దిగుబడి తగ్గిపోయింది. అలా కాకుండా కషాయాలు, ద్రావణాల్లో వైరస్లను తట్టుకొనే శక్తి ఉందని నిరూపించడం జరిగింది. ఇందుకుగాను ఇకోవా సంస్థ జైవిక్ పురస్కారానికి ఎంపికయ్యాను. జనవరి 22న బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో పురస్కారం అందుకున్నాను." - గోపాలకృష్ణమూర్తి, జైవిక్ పురస్కార గ్రహీత
Jaivik India Awards 2025 : ఆసక్తి ఉన్నవారికి గోపాలకృష్ణమూర్తి తన వనరుల కేంద్రంలోనే కషాయాలు, ద్రావణాలు తయారు చేయడంపై ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. లాభాపేక్షతో కాకుండా భూమిని తిరిగి సారవంతం చేయాలన్న తపనతో ఆయన ఈ పనిచేస్తున్నారు. పూర్తి నాణ్యతతో వనరులను తయారు చేయడంలో ఎవరికీ సాధ్యంకాని రీతిలో విలువను జోడించి ప్రత్యేకత చాటుకుంటున్నారు. గోపాలకృష్ణమూర్తి సేవల్ని గుర్తించిన ఇకోవా సంస్థ జీవ వనరుల తయారీ, నిర్వహణ విభాగంలో జైవిక్ పురస్కారం అందజేసింది.
గత నెల 22న బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో గోపాలకృష్ణమూర్తి జైవిక్ పురస్కారం అందుకున్నారు. రైతులు రసాయనాల వాడకాన్ని క్రమంగా తగ్గించాలని ఆయన అంటున్నారు. సేంద్రియ సాగు వైపు మళ్లడం వల్ల భవిష్యత్ తరాల వారికి మంచి ఆహారంతోపాటు ఆరోగ్యాన్ని అందించిన వారవుతారని చెబుతున్నారు.
"ప్రకృతి సాగు పుడమికి శ్రీరామరక్ష" - మాస్టర్ ట్రైనర్ ద్వారా శిక్షణ ఇప్పిస్తున్న ప్రభుత్వం
Organic farming: సేంద్రియ సాగుతో అద్భుతాలు.. రూ.12 లక్షల పెట్టుబడితో రూ.30 లక్షల ఆర్జన