Lord Govinda Name History : కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతిలో అడుగు పెట్టగానే వినిపించే పదం 'గోవిందా'. భక్తులంతా 'ఏడుకొండలవాడా వేంకటరమణ గోవిందా, గోవిందా' అని స్మరిస్తూ శ్రీనివాసుడి దర్శనానికి బయల్దేరుతారు. తిరుమలలోని సప్తగిరుల్లో గోవింద నామ స్మరణ మార్మోగుతుంది. అయితే, గోవిందా అంటే అర్థం ఏమిటో చాలా మంది భక్తులకు తెలియదు. గోవిందా అంటే వేంకటేశ్వరస్వామి నామం అనే అనుకుంటారు కానీ, ఆ పదం ఆవిర్భావం వెనుక చరిత్ర చాలామందికి తెలియదు. ఈ నేపథ్యంలో గోవిందా అనే పదం ఎలా వచ్చిందో తెలుసుకుందామా?
"గోవింద" అనే పదం "గో"+"వింద" అనే రెండు పదాల కలయికగా తెలుస్తోంది. గో అంటే గోవులు, వింద అంటే కాపరి అని అర్థం. గో అంటే ఇంద్రియాలు, వింద అంటే ఇంద్రియాలకు ఆనందాన్ని ఇచ్చేదని మరో అర్థం కూడా భాగవతంలో ఉంది. శ్రీకృష్ణుడు తన బాల్యంలో గోపాలకులలో పెరిగి, గోవులను కాపాడేవాడు కాబట్టి ఈ పేరు ఆయనకు ఎంతో సరిపోతుంది.
తిరుమలలోని ఈ పెయింటింగ్ ఏమిటో తెలుసా? - 90శాతం మంది భక్తులు ఫెయిల్!
ఇక ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం తెలిసిందే కదా. గోకులం వాసులపై ఇంద్రుడు ఆగ్రహించి ఉరుములు, పిడుగులతో భీకర వర్షాన్ని కురిపిస్తాడు. ఆ పెను విపత్తు నుంచి గోకులంంతో పాటు గోవులను కాపాడేందుకు శ్రీకృష్ణుడు గోవర్థన పర్వతాన్ని తన చిటికెన వేలుతో ఎత్తి రక్షణగా పట్టుకుంటాడు. దీంతో ప్రజలంతా గోవులతో సహా పర్వతం కిందకు చేరి తమను రక్షించుకుంటారు. దీంతో గర్వభంగమైన ఇంద్రుడు క్షమాపణ కోరేందుకు వెళ్లగా ఆ సమయంలో కామధేనువు కూడా అక్కడకు వస్తుందట. గోవులను రక్షించిన కృష్ణుని పట్ల కృతజ్ఞతగా తన పాలతో అభిషేకం చేస్తుందట. ఆ దృశ్యాన్ని చూసిన ఇంద్రుడు కూడా గంగాజలంతో కృష్ణుని అభిషేకించవలసిందిగా తన వాహనమైన ఐరావతాన్ని ఆజ్ఞాపిస్తాడు. గోవులన్నింటికీ శ్రీకృష్ణడు అధిపతి అని, ఆ క్షణం నుంచే గోవిందుడిగా కూడా పిలుచుకుంటారని ఇంద్రుడు చెప్పగా ప్రజలంతా గోవింద నామస్మరణతో పూజలు చేస్తారట.
ఇదిలా ఉంటే కలియుగంలో గోవిందా అనే నామం వెనుక మరో కథ ప్రచారంలో ఉంది. పౌరాణిక కథను అనుసరించి కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి భూలోకంలో కొలువుదీరేందుకు తిరుపతిలో ఏడుకొండలను ఎంచుకున్నాడట. అగస్త్యమహా ముని అప్పటికే అక్కడ ఆశ్రమం ఏర్పరచుకుని తపస్సు చేసుకుంటున్నాడట. ఆ దృశ్యాన్ని చూసిన వేంకటేశ్వరుడు 'మునివర్యా! నేను వేంకట నామకుడిని, కలియుగాధిపతిని. ఈ సప్తగిరిపై కొలువు తీరుదామని వచ్చా'నని చెప్పాడట. రోజూ క్షీరం సేవించటానికి తనకు ఓ గోవు కావాలని కోరాడట. సాక్షాత్తు వేంకటేశ్వరడే వచ్చి అడగడంతో అగస్త్య మహా మహర్షి ఎంతో సంతోషించాడట. వెంటనే 'అయ్యో స్వామీ ఎందుకివ్వను! కానీ మీరు మా అమ్మ శ్రీమహాలక్ష్మితో కలిసి ఇక్కడికి వచ్చినప్పుడే ఇస్తాను'’ అని చెప్పాడట. దాంతో సరే అలాగే అని వెంటనే అంతర్థానమైన వేంకటేశ్వరుడు కొన్నాళ్లకే లక్ష్మీదేవిని వెంటబెట్టుకుని తిరిగి అగస్త్యాశ్రమానికి వచ్చాడట. ఆ సమయంలో అగస్త్య మహాముని లేకపోడంతో ఆయన శిష్యుడు ముందుకొచ్చి ఏం కావాలని ప్రశ్నించాడట.
ఆ స్వామి విగ్రహం నిలువెల్లా విషం - తొడ భాగంలో విభూతి పంపిణీ
నాయనా! నీ గురువు నాకు ఒక పాడి ఆవును ఇస్తానని మాటిచ్చాడని, అందుకే ఇక్కడికి వచ్చానని, గోవును ఇస్తే వెంట తీసుకెళ్తానని తన రాకకు కారణం తెలిపాడట. కాగా, వచ్చింది స్వయంగా భగవానుడనే విషయం తెలియని మునీశ్వరుడి శిష్యుడు 'తన గురువు ఆశ్రమానికి రాగానే సంగతి తెలియజేస్తా'నని బదులివ్వడంతో స్వామి వారు వెనుతిరిగి వెళ్లాడట.
కాసేపటికి ఆశ్రమానికి చేరుకున్న అగస్త్య మునీశ్వరుడు శ్రీవారి రాక విషయం తెలుసుకున్నాడట. 'ఎంతపని చేశావు నాయనా' అంటూ ఆవును వెంట తీసుకుని అల్లంత దూరంలో కనిపిస్తున్న స్వామిని ఉద్దేశించి బయల్దేరాడట. 'వేంకట స్వామీ! గోవిందా! వేంకట స్వామీ! గోవిందా!' (గోవు ఇందా, గోవు ఇదిగో అనే అర్థంలో) అని పిలుస్తూ వెళ్లాడట. దాంతో స్వామి వారు అక్కడ ఆగిపోయి 'గోవిందా గోవిందా అని పిలుస్తూ వచ్చి గోమాతను అందజేశావు కదా! గోవిందనామం నాకు పరమప్రీతికరమైంది. గోవిందుడన్నది నా నామాల్లో ముఖ్యమైందిగా పరిగణిస్తూ భక్తులు ఈ నామాన్ని 108 సార్లు పలికితే మోక్షప్రాప్తి కలిగిస్తాను' అని వాగ్దానం చేశాడట. అగస్త్య మునీశ్వరుడు అందించిన గోవును సంతోషంగా స్వీకరించి వెంట తీసుకుని వెళ్లాడని పౌరాణిక కథ. ఈ కారణంగానే భక్తులంతా గోవిందా, గోవిందా అనే నామాన్ని స్మరిస్తూ కాలినడకన వెళ్లి ఆ ఏడుకొండల స్వామిని దర్శించుకుంటారు.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
'పద్మ' అవార్డు గ్రహీతలకు ఎలాంటి ప్రయోజనాలు? - ప్రత్యేక ప్యాకేజీ ఉంటుందా?