Data City in Visakha : హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ తరహాలో విశాఖలోని మధురవాడ దగ్గర 500 ఎకరాల్లో డేటా సిటీని అభివృద్ధి చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. హౌసింగ్ డేటా సెంటర్లు, కృత్రిమ మేధ (ఏఐ) హబ్‌ల ఏర్పాటు కంపెనీలకు అందులో చోటు కల్పించనుంది. డీప్ టెక్నాలజీ, ఏఐ, బిగ్ డేటా రంగాల్లో ప్రపంచ వ్యాప్తంగా విస్తృత అవకాశాలున్నాయని భావిస్తున్న ప్రభుత్వం వాటిని అందిపుచ్చుకోవడానికి ఈ డేటా సిటీపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది.
ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నంలో ఐటీ రంగం అభివృద్ధిని ప్రాధాన్యంగా తీసుకుంది. ఐటీ మంత్రి లోకేశ్ ఆలోచనలకు అనుగుణంగా డేటా సిటీ రూపుదిద్దుకోనుంది. విశాఖకు వచ్చే ఐటీ ఆధారిత కంపెనీలకు డేటా సిటీని కేంద్రంగా చేయాలన్నది సర్కార్ ఆలోచన.
ప్రముఖ ఐటీ కంపెనీల దృష్టి :
- గూగుల్ సంస్థ విశాఖలో 80 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న డేటా సిటీ అభివృద్ధికి సర్కార్ సహకరిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం, యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడానికి గూగుల్ సంస్థ సహకరించేలా అవగాహన ఒప్పందం కుదిరింది.
- టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) విస్తరణ ప్రాజెక్టును విశాఖలో ఏర్పాటు చేస్తోంది. మేధా టవర్స్‌లో ఖాళీ స్థలాన్ని ఈ సంస్థకు సర్కార్ తాత్కాలికంగా కేటాయించింది. 90 రోజుల్లో కార్యకలాపాలు ప్రారంభించనుంది. శాశ్వత కార్యాలయ నిర్మాణానికి 30 ఎకరాలు కేటాయించింది.
- నూతన క్యాంపస్ ఏర్పాటు కోసం పలు ప్రాంతాలను ఇన్ఫోసిస్ పరిశీలిస్తోంది. విస్తరణపై దృష్టి పెట్టిన విప్రోను విశాఖకు తీసుకొచ్చేలా ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది.
- కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్‌తో మంత్రి లోకేశ్ దావోస్‌లో భేటీ అయ్యారు. ఆ సంస్థ త్వరలో విశాఖకు వచ్చే అవకాశముంది.
ఐటీ కంపెనీలతో లోకేశ్ చర్చలు : ఇటీవల దావోస్‌లో ప్రపంచ దేశాల పెట్టుబడుల సదస్సులో పలు సంస్థల సీఈవోలతో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఐటీ రంగానికి ఏపీలో ఉన్న అవకాశాలను వివరించారు. కృత్రిమ మేధ (ఏఐ), డీప్‌టెక్ రంగాల్లో నవీన ఆవిష్కరణల కోసం రాష్ట్రంలోని యూనివర్సిటీలతో కలిసి పనిచేయాలని స్విస్ పరిశోధన సంస్థలను ఆహ్వానించారు. సాంకేతికత బదిలీ కోసం ఇన్నోవేషన్ హబ్, ఇంక్యుబేటర్లు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ఆ సంస్థను కోరారు.
ఇందులో భాగంగా కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్‌తోనూ భేటీ అయ్యారు. ప్రపంచంలోని 100 అత్యుత్తమ కంపెనీలను ఏపీకి తీసుకువచ్చేందుకు సంప్రదింపులు జరుపుతున్నామని లోకేశ్ తెలిపారు. ఐటీ రంగం ద్వారా 5 లక్షల మందికి ఉపాధి కల్పించాలన్నదే ఆలోచనని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసే మొదటి 500 కంపెనీలను ప్రాధాన్యంగా తీసుకుని దేశంలో ఎవరూ ఇవ్వనంత తక్కవ ధరకు భూములిస్తామని పలు ఐటీ సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశాల్లో లోకేశ్ ప్రతిపాదించారు.
దావోస్‌లో మంత్రి లోకేశ్ బిజీబిజీ - పలు కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలు
పరిశ్రమల ఏర్పాటుకు ఏపీలో పూర్తి సానుకూల వాతావరణం: నారా లోకేశ్