Attack On Women In Madhurawada At Visakha District: విశాఖ జిల్లా మధురవాడలో దారుణం చోటు చేసుకుంది. దంపతులు ఓ మహిళపై దాడి చేసి నడిరోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లిన అమానవీయ ఘటన జరిగింది. ఈ ఘటనపై పీఎంపాలెం సీఐ జి. బాలకృష్ణ కేసు నమోదు చేశారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. నగరంలోని మిథిలాపురి వుడా కాలనీ గాంధీవిగ్రహం కూడలిలో రెండు బడ్డీలను వంకల నాగలక్ష్మి అనే మహిళ నెలవారీ అద్దెకు తీసుకున్నారు. వాటిల్లో ఒకటి మరుపల్లి వెన్నెల అనే మహిళకు అద్దెకు ఇచ్చారు.
చినిగి చినిగి పెద్దదైన గొడవ: ఈ విషయం అసలు యజమాని రమేశ్‌కు తెలియడంతో బడ్డీలు ఖాళీ చేయాలని నాగలక్ష్మికి చెప్పాడు. ఆమె వెన్నెలకు చెప్పగా అద్దె లావాదేవీలు ఉండటంతో అంగీకరించలేదు. ఈ విధంగా ఇరువురి మధ్య ఈ నెల 24న వివాదం చోటు చేసుకోగా అనంతరం మాటలు పెరిగి గొడవ పెద్దది కావడంతో వెన్నెల దంపతులు నాగలక్ష్మిపై దాడికి దిగారు. మహిళ అని చూడకుండా ఆమె జుట్టు పట్టుకుని రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లారు. ఆపై పంచాయతీ పోలీసుస్టేషన్‌కు చేరడంతో విచారణ జరిపి ఇద్దరు మహిళల ఫిర్యాదులతో కేసులు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు.
దంపతులపై కేసు నమోదు: ఇదిలా ఉండగా దంపతులిద్దరూ తనపై అత్యంత కిరాతకంగా దాడికి పాల్పడితే పోలీసులు తగిన న్యాయం చేయలేదని నాగలక్ష్మి చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ విషయం సీపీ శంఖబ్రత బాగ్చీ దృష్టికి చేరింది. సీపీ శంఖబ్రత బాగ్చీ ఆదేశాల మేరకు దంపతులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.
ప్రేమిస్తున్నాడని యువకుడిని చితకబాదిన యువతి బంధువులు - వీడియో వైరల్