Unseasonal Rains in AP : భానుడి భగభగలకు ప్రజలు అల్లాడుతున్న వేళ మంగళవారం కురిసిన వర్షం రాష్ట్ర ప్రజలకు కొంత ఉపశమనం కలిగించింది. అయితే ఈ అకాల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. భారీ ఈదురుగాలులకు మామిడి పంట నేలరాలింది. వందల ఎకరాల్లో పసుపు, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. వర్షపు నీరు ఎక్కడికక్కడ రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Krishna District :ఈదురు గాలులతో కూడిన వర్షానికి ఉమ్మడి కృష్ణాజిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారు. మైలవరం, నూజివీడు, ఆగిరిపల్లి ప్రాంతాల్లో మామిడి కాయలు రాలిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మోపిదేవి, అవనిగడ్డ, చల్లపల్లి మండలాల్లో ఒక్కసారిగా వాతావరణం మారడంతో వందలాది ఎకరాల్లో పసుపు, మొక్కజొన్న ఆరబెట్టిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి చుట్టుపక్కల గ్రామాల్లో ఉరుములు, మెరుపులు, భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ప్రధాన రహదారులన్నీ జలమయమవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రెయిన్ అలర్ట్- నాలుగు రోజుల పాటు కూల్ వెదర్ - Rain Alert In Andhra Pradesh
Nandhyala District : నంద్యాల జిల్లా కరివేన గ్రామంలో కురిసిన వర్షానికి వాన నీరు ఇళ్లల్లోకి చేరింది. నీరు వెళ్లేందుకు కాలువ తీసే విషయంలో పొరుగు వారితో జరిగిన ఘర్షణలో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మృతి చెందాడు. ఆత్మకూరు మండలం ముష్టేపల్లిలో వడగళ్ల వాన పడటంతో చెట్లపైన ఉన్న పక్షులు కిందపడి ఇబ్బందిపడ్డాయి. గాలివాన బీభత్సంతో పశువుల పాకలు, రేకుల షెడ్లు విరిగిపడిపోయాయి. అనంతపురంలో కురిసిన చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ జలమయమయ్యాయని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ మండిపడ్డారు. 1100 కోట్లతో నగర అభివృద్ధి చేశామన్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ప్రజలకు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. మాటలు తప్ప అభివృద్ధి చేసిందేమి లేదని దుయ్యబట్టారు. టీడీపీ అధికారంలోకి వస్తే మూడు నెలల్లో నగర సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నీళ్లలోనే రాకపోకలు సాగిస్తున్న వాహనదారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.