Battery Storage Projects in AP : రాష్ట్ర విద్యుత్ రంగంలో కొత్త సాంకేతికత అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు సౌర, పవన, పంప్డ్ స్టోరేజి విద్యుత్ ప్రాజెక్టులు మాత్రమే ఉండగా ఇకపై బ్యాటరీ స్టోరేజి విద్యుత్ ప్రాజెక్టులూ ఏర్పాటు కానున్నాయి. ఏపీలో వెయ్యి మెగావాట్ల నిల్వ సామర్థ్యంతో వాటిని నెలకొల్పేందుకు కేంద్రం అనుమతించింది. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా నాలుగుచోట్ల ఆయా ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం వయబులిటి గ్యాప్ ఫండ్ అందించనుండటంతో ఆంధ్రప్రదేశ్‌పై యూనిట్ వ్యయం కూడా తగ్గనుంది.
నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నాలుగుచోట్ల బ్యాటరీ స్టోరేజి విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. దీనికి సంబంధించి త్వరలో టెండర్లు పిలిచి, ఎంపిక చేసిన సంస్థలతో ఎన్‌హెచ్‌పీసీ విద్యుత్ విక్రయ ఒప్పందం కుదుర్చుకోనుంది. అదే సమయంలో డిస్కంలతో కరెంట్ కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. ఈ ప్రాజెక్టులు ఏడాదిన్నర లోపు అందుబాటులోకి వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. వీటికి సంబంధించి మెగావాట్ అవర్‌కు ప్రస్తుత ధరల ప్రకారం రూ.2.6 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ లెక్కన రాష్ట్రంలో ఏర్పాటు చేసే 2000ల మెగావాట్ అవర్ బ్యాటరీ స్టోరేజి ప్రాజెక్టుకు రూ.5200 కోట్ల మేర వ్యయం కానుంది.
Battery Energy Storage System in AP : ఈ ప్రాజెక్టు సామర్థ్యం వెయ్యి మెగావాట్లుగా కేంద్రం అనుమతించింది. ఒక్కో సైకిల్‌లో 2 గంటల చొప్పున రెండు సైకిల్స్‌లో కలిపి 2000ల మెగావాట్ అవర్ విద్యుత్ స్టోరేజి సామర్థ్యం అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా డిమాండ్ ఎక్కువగా ఉండే ఉదయం, సాయంత్రం సమయాల్లో రెండు గంటల చొప్పున వినియోగించుకోవడానికి వీలుగా విద్యుత్ నిల్వ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా అధిక ధరతో కరెంట్ కొనుగోలు చేసే భారం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా ఉన్న వేళల్లో యూనిట్ గరిష్ఠంగా రూ.10 చొప్పున డిస్కంలు కొంటున్నాయి. ఆ సమయంలో నిల్వ చేసిన కరెంట్‌ను వినియోగించుకునేలా ప్రణాళిక రూపొందించారు. తద్వారా ఇన్‌పుట్ విద్యుత్‌తో కలిపి యూనిట్ రూ.5.30కే అందుబాటులోకి వస్తుందని అంచనా. ఈ ప్రాజెక్టులకు అవసరమైన ఇన్‌పుట్ విద్యుత్‌ను డిస్కంలు అందిస్తాయి. ఇప్పటి వరకు అస్ట్రేలియా, అమెరికా వంటి దేశాల్లో ఈ తరహా ప్రాజెక్టులు ఉన్నాయి. కొద్ది మొత్తంలో గుజరాత్‌లోనూ ఏర్పాటయ్యాయి.
రాష్ట్రంలో నాలుగు చోట్ల : రాష్ట్రంలో నాలుగుచోట్ల ఈ ప్రాజెక్టులు ఏర్పాటుకానున్నాయి. కుప్పంలో గృహాలపై సౌర పలకలు అమర్చి వాటి ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్‌ను వినియోగించుకునేలా ప్రభుత్వం ప్రయోగాత్మక పథకాన్ని చేపట్టింది. అక్కడ ఉత్పత్తయ్యే అదనపు కరెంట్‌ను నిల్వ చేసేందుకు 100 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజి ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. గోదావరి జిల్లాల్లోని గోదావరి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర 100 మెగావాట్ల ప్రాజెక్టును ప్రతిపాదించారు. దీంతో ఇక్కడ ఒక్కోసారి తలెత్తుతున్న లో-వోల్టేజీ సమస్య పరిష్కారం కానుంది.
జమ్మలమడుగు వద్ద మైలవరంలో 750 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చారు. వాటిని గ్రిడ్‌కు అనుసంధానం చేసేందుకు అవసరమైన ప్రత్యేక నెట్‌వర్క్‌కు బదులు 400 మెగావాట్ల సామర్థ్యంతో బ్యాటరీ స్టోరేజిని ప్రతిపాదించారు. కర్నూలు జిల్లా గని వద్ద సోలార్ పార్కులో మరో 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అక్కడ ఈ తరహా ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన భూములు అందుబాటులో ఉన్నాయి.
ఒక్కో మెగావాట్ అవర్‌కు రూ.27 లక్షల చొప్పున కేంద్ర ప్రభుత్వం వయబులిటి గ్యాప్ ఫండ్ కింద అందించనుంది. దీని ప్రకారం నెలకు మెగావాట్ అవర్‌కు రూ.2.2 లక్షల చొప్పున అవుతుందని అంచనా. ఈ లెక్కల ప్రకారం స్థిర ఛార్జీల కింద యూనిట్‌కు రూ.2.60 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని ఇంధన శాఖ అంచనా. ఇన్‌పుట్ విద్యుత్ యూనిట్‌కు సగటున రూ.2.70 అవుతుంది. మొత్తంగా యూనిట్ రూ.5.30 చొప్పున అందుబాటులో ఉంటుంది.
కేంద్రం వీజీఎఫ్‌తో తగ్గనున్న యూనిట్ వ్యయం : కేంద్ర ప్రభుత్వం అందించే వయబులిటి గ్యాప్ ఫండ్ వల్ల యూనిట్‌కు 70 పైసల భారం తగ్గనుంది. ఈ ప్రాజెక్టుతో అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. పగటి వేళల్లో ఒక్కోసారి పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ఒక్కసారిగా పడిపోతుంది. ఆ సమయంలో గ్రిడ్ ఫ్రీక్వెన్సీ 49.9 నుంచి 50.05 రేంజ్ మధ్య నిర్వహించాలి. అలాంటి సందర్భాల్లో జాతీయ గ్రిడ్ నుంచి పరిమితి కంటే అదనంగా కరెంట్ తీసుకోక తప్పడం లేదు. అలా తీసుకున్న దానికి జరిమానాగా యూనిట్‌కు రూ.20 నుంచి రూ.40 వరకు చెల్లించాల్సి వస్తోంది. ఈ రూపేణా ఏటా సుమారు రూ.180 కోట్ల మేర విద్యుత్ సంస్థలపై భారం పడుతోంది.
బ్యాటరీ స్టోరేజి విద్యుత్ అందుబాటులో ఉంటే ఆ జరిమానాల భారం తగ్గే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో నెట్‌వర్క్‌పై అధిక భారం పడుతోంది. అది కూడా కొద్ది వ్యవధి మాత్రమే. దీనికోసం అదనంగా లైన్లు ఏర్పాటు చేసే బదులు బ్యాటరీ స్టోరేజి ప్రాజెక్టులను ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. గ్రిడ్‌కు పునరుత్పాదక విద్యుత్ అనుసంధానం అధికంగా ఉంది. దీన్ని సమన్వయం చేయడానికి కూడా ఈ ప్రాజెక్టులు ఉపయోగపడతాయి.
కేంద్ర పథకం : 300 యూనిట్ల విద్యుత్ ఫ్రీ - వాడకుంటే డబ్బులు కూడా!