AP Govt Focus on Solar Power : ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని గణనీయంగా తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రాయోజిత పథకమైన పీఎం సూర్యఘర్ యోజన కింద ప్రతి ఇంటినీ సోలార్ ద్వారా విద్యుత్ వినియోగానికి అనుసంధానించేందుకు సర్కార్ అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికిపైగా డ్వాక్రా మహిళలున్న నేపథ్యంలో వారి ద్వారా అంచెలంచెలుగా విస్తృత పరచాలని నిర్ణయించింది. తొలి విడతగా లక్ష మంది డ్వాక్రా మహిళల ఇళ్లపై సోలార్ రూఫ్‌టాప్‌ను అమర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.
వీటి ఏర్పాటు వల్ల కలిగే లబ్ధిపై గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అధికారులు డ్వాక్రా మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. సమ్మతి తెలిపిన వారికి రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 80,000ల మంది సమ్మతి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో 700 ఇళ్లపై సోలార్ ప్యానళ్లు అమర్చగా వాటిలో 400 గృహాలు డ్వాక్రా మహిళలవే ఉన్నాయి. ఇతర జిల్లాల్లోనూ ప్యానళ్ల ఇన్‌స్టాలేషన్ ప్రారంభమైంది.
కేటగిరీని బట్టి రాయితీ : పీఎం సూర్య ఘర్ యోజన గృహ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. దీని కింద 3 రకాల సామర్థ్యంతో సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటుకు ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. మూడు కిలోవాట్ల సామర్థ్యం ఉన్న రూఫ్‌టాప్ ఏర్పాటు వ్యయం రూ.1.95 లక్షలు కాగా రాయితీ రూ.78,000లు వస్తుంది. రెండు కిలోవాట్లయితే రూ.1.40 లక్షలు కాగా రాయితీ రూ.60,000లు వర్తిస్తుంది. ఒక కిలోవాట్ వ్యయం రూ.70,000లు కాగా రూ.30,000ల రాయితీ లభిస్తుంది.
PM Surya Ghar Yojana : లబ్ధిదారులు వారి ఇంటి విద్యుత్ వినియోగాన్ని బట్టి రూఫ్‌టాప్ సామర్థ్యాన్ని ఎంపిక చేసుకోవచ్చు. లబ్ధిదారు వాటా 10 శాతం పోనూ, మిగతా మొత్తాన్ని 7 శాతం వడ్డీపై బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించే బాధ్యతను సెర్ప్ అధికారులు తీసుకుంటున్నారు. ఒకవేళ లబ్ధిదారు 10 శాతం వాటా కూడా చెల్లించలేని స్థితిలో ఉంటే ఆ మొత్తాన్ని బ్యాంకు, స్త్రీనిధి, పొదుపు మొత్తం నుంచి అందించనున్నారు.