Union Minister Kishan Reddy on Hyderabad Development : ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ నగరంపై ఒక ప్రణాళిక అంటూ లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం హైదరాబాద్ అంటే హైటెక్ సిటీనే అన్నట్లు వ్యవహరించిందని తెలిపారు. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి విషయంలో కేంద్రం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. నాలుగు రోజుల క్రితం బస్తీబాట కార్యక్రమంలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్ వాసవీ బృందావన్ గేటెడ్ కమ్యూనిటీలో కిషన్ రెడ్డి పర్యటించారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం గత ప్రభుత్వం మాదిరిగానే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని ఇప్పుడు వాటిని కట్టే పరిస్థితి లేదని ఆరోపించారు. వారి చర్యలతో ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని విమర్శించారు. కనీస అభివృద్ధి పనులు చేసేందుకు కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని టెండర్లు ఇవ్వలేకపోతున్నారన్నారు.
తెలంగాణలో అత్యధిక శాతం ప్రజలు హైదరాబాద్‌లోనే నివసిస్తుంటారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అందుకే ఇక్కడ మౌలిక వసతులను ఏర్పాటు చేసి ప్రజలకు అందించాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం దాని ప్రాధాన్యతను మార్చుకుంటుందని చెప్పారు. డిఫెన్స్, ఐటీ, ఫార్మా, హెల్త్ లాంటి ప్రధానమైన రంగాలకు హైదరాబాద్ హబ్‌గా ఉందని, అందుకే పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని వివరించారు.