Two More Vande Bharat Trains for Telugu States : తెలుగు రాష్ట్రాల ప్రజలకు కొత్తగా మరో రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. వీటిని ఈనెల 16న అహ్మదాబాద్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. రెండు రైళ్లలో ఒకటి తెలంగాణలోని హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పుర్ మధ్య, మరొకటి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ మధ్య రాకపోకలు సాగించనున్నాయి. ఈ మేరకు కేంద్ర గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించారు.
ఇవి తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ అందించిన వినాయక నవరాత్రుల కానుక అని పేర్కొన్నారు. దేశంలో దిల్లీ తర్వాత హైదరాబాద్ నుంచే అత్యధిక (తాజా రైలుతో కలిపి వీటి సంఖ్య 5) వందేభారత్ రైళ్లు అనుసంధానం అయ్యాయన్నారు. హైదరాబాద్ నగరానికి మరో వందేభారత్ కేటాయించినందుకు ప్రధానికి కేంద్ర మంత్రి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. 16న నాగ్‌పుర్ నుంచి ప్రారంభమయ్యే రైలుకు స్వాగతం పలికేందుకు సికింద్రాబాద్ స్టేషన్‌కు రావాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ని ఆహ్వానించినట్లు పేర్కొన్నారు.
578 కి.మీ, 7.20 గంటల్లో సికింద్రాబాద్-నాగ్‌పుర్ : ఉదయం 5 గంటలకు నాగ్‌పుర్‌లో బయల్దేరే వందేభారత్ ట్రైన్ మధ్యాహ్నం 12.15కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరిగి సికింద్రాబాద్ జంక్షన్లో మధ్యాహ్నం 1 గంటకు బయల్దేరి అదేరోజు రాత్రి 8.20కి నాగ్‌పుర్ చేరుకోనుంది. 578 కి.మీ. దూరాన్ని కేవలం 7.20 గంటల్లో చేరుకుంటుంది. మహారాష్ట్రలోని సేవాగ్రామ్, చంద్రాపూర్, బల్లార్ష.. తెలంగాణ రాష్ట్రంలోని రామగుండం, కాజీపేట స్టేషన్లలో రెండు నిమిషాల చొప్పున ఈ రైళ్లు ఆగుతాయి.
- నాగ్‌పుర్-సికింద్రాబాద్ సర్వీసు టైమింగ్ :రామగుండం ఉదయం 9.08, కాజీపేట రైల్వే స్టేషన్‌కు 10.04 గంటలకు చేరుకుంటుంది.
- సికింద్రాబాద్-నాగ్‌పుర్ :కాజీపేట స్టేషన్ మధ్యాహ్నం 2.18, రామగుండం 3.13 గంటలకు చేరుకుంటుంది.