Parliament Winter Session 2024 :లోక్‌సభలో బుధవారం నాడు టీడీపీ ఎంపీలు పలు ప్రశ్నలను లెవనెత్తారు. వాటికి కేంద్ర మంత్రులు సమాధానం ఇచ్చారు. సోషల్ మీడియాలో మహిళలను వేధించి, బెదిరించేవారికి భారతీయ న్యాయ సంహిత 2023 కింద ఐదు సంవత్సరాల వరకు జైలుశిక్ష, జరిమానా విధించడానికి వీలుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖ సహాయమంత్రి జితిన్ ప్రసాద పేర్కొన్నారు. ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేష్‌కుమార్ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.
ఆడవారిపై నేరాలకు పాల్పడేవారికి భారతీయ న్యాయ సంహిత చట్టం కింద విధించే శిక్షతోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్-2000 కింద అదనంగా శిక్ష విధించడానికి వీలుందని జితిన్ ప్రసాద వివరించారు. మహిళల శారీరక గోప్యతను ఉల్లంఘించినప్పుడు, లైంగిక సంబంధ, అసభ్య విషయాలను ఎలక్ట్రానిక్ పద్ధతిలో ప్రసారం చేసినప్పుడు శిక్షార్హులవుతారని తెలిపారు. సోషల్ మీడియా ద్వారా వేధింపులకు పాల్పడే అంశాలకు సంబంధించి ఏపీలో 2018లో 89, 2019లో 58, 2020లో 145, 2021లో 105, 2022లో 136 కేసులు నమోదైనట్లు చెప్పారు. ఇందులో అత్యధిక కేసులు విజయవాడ సిటీ, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఉన్నట్లు జితిన్ ప్రసాద వెల్లడించారు.