Union Minister Kumaraswamy Visakhapatnam Tour: విశాఖ ఉక్కు భవిష్యత్‌పై మళ్లీ ఆశలు రేగుతున్నాయి. మూడు సంవత్సరాలకు పైగా ఉద్యోగుల ఆందోళన, జీతాలు సరిగా ఇవ్వలేని పరిస్థితి. నిర్వహణకు ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితిలో ఉన్న ఉక్కు కర్మాగారానికి, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ఈరోజు రానున్నారు. ఉన్నతాధికారులు, కార్మిక నేతలతో గురువారం నాడు సమీక్షించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఏం చెబుతారు, సెయిల్‌లో విలీన ప్రతిపాదనపై ఎలా స్పందిస్తారనేది కీలకంగా మారింది.
ఇటీవలే ఏపీ బీజేపీ ఎంపీలు కేంద్ర ఉక్కుమంత్రి కుమారస్వామిని కలిశారు. స్టీల్ ప్లాంట్‌పై ఇక్కడ ప్రజల ఆకాంక్షలు, ప్రైవేటీకరణ విషయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయణ్ని కోరారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో, రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్‌ను విలీనం చేయడం వల్ల రెండు కంపెనీలు లాభపడతాయని వారు కుమారస్వామికి వివరించారు.
Visakha Steel Plant Issue Updates : మరోవైపు విశాఖ ఉక్కు కార్మికులు మూడు సంవత్సరాలకు పైగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. వివిధ స్థాయిల్లో తమ నిరసనన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నేరుగా కొంత వర్కింగ్ క్యాపిటల్ రూపంలోనూ లేదా రుణ పరపతిలోనూ సర్దుబాటు చేయాలని కోరుతున్నారు. అదేవిధంగా ముడి సరుకుకు సంబంధించి కొంత వెసులుబాటు ఇవ్వాలని అంటున్నారు. ఈ క్రమంలోనే సొంతంగా గనులు కేటాయింపులకు సంబధించిన పరిష్కారం కోసం, ఎన్ఎండీసీతో ప్రత్యేకంగా ఒప్పందం చేయడం వంటివి ఉక్కు కర్మాగారాన్ని లాభాల బాట పట్టిస్తాయని కార్మికులు చెబుతున్నారు.