How to Build Positive Confidence in New Year : ఆ అమ్మాయి చాలా లావుంది, రంగు కూడా తక్కువే ఇలా ఎదుటివారి శరీరాకృతి, అందం గురించి కొందరు విమర్శలు చేస్తుంటారు. కామెంట్ చేసేవారు ఏ ఉద్దేశంతో ఆ మాటలన్నా ఇవి ఆ అమ్మాయిల్ని తీవ్ర మానసిక వేదనకు గురిచేస్తాయి. ఒకానొక టైమ్‌లో తమ శరీరాన్ని తాము అసహ్యించుకునేలా చేస్తాయి. అయితే, ఈ కొత్త ఏడాదిలో ఇలాంటి ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. వీటిని దూరం చేసుకోవాలంటే 'సెల్ఫ్ లవ్' (స్వీయ ప్రేమ) పెంచుకోవాలని అంటున్నారు. అందుకోసం కొన్ని టిప్స్ సూచిస్తున్నారు. అవి మీ కోసం
వ్యాయామంతో సెల్ఫ్ లవ్!
బాడీ షేమింగ్ కారణంగా దాదాపు 91 శాతం మంది మహిళలు తమ శరీరం పట్ల సంతృప్తిగా లేరని ఓ పరిశోధన చెబుతోంది. అంతేకాదు ఇతరులు అనే మాటలను పట్టించుకుని, ఇతరులతో పోల్చుకుంటూ కాస్మెటిక్ సర్జరీల ద్వారా తమ అందానికి మెరుగులు దిద్దుకునే వారి సంఖ్యా క్రమంగా పెరుగుతున్నట్లు నిపుణులంటున్నారు. నిజానికి ఇలాంటి నెగటివ్ ఆలోచనల వల్ల నష్టపోయేది మనమే! కాబట్టి, ప్రతికూల ఆలోచనలను తగ్గించుకోవడానికి రోజూ వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. ఎక్సర్సైజ్లు చేసే క్రమంలో మన బాడీలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఈ హ్యాపీ హార్మోన్లు మనలోని నెగటివ్ ఆలోచనల్ని దూరం చేసి మనల్ని హ్యాపీగా ఉంచుతాయి. అలాగే వ్యాయామం వల్ల శరీర బరువు కూడా తగ్గుతుంది. తద్వారా స్వీయ ప్రేమ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
సౌకర్యంగా ఉండే దుస్తులు!
'మొన్నటిదాకా పట్టిన దుస్తులు ఇప్పుడు పట్టట్లేదంటే అంత లావయ్యానా?' అనుకుంటారు కొంతమంది. అయితే దీనికి బదులు 'నా శరీరాకృతికి తగ్గట్లుగా, కంఫర్ట్‌గా ఉండే దుస్తులు ఎంపిక చేసుకుంటే సరిపోతుంది కదా' అన్న పాజిటివ్ ఆలోచనలు మనసులోకి రావాలంటున్నారు నిపుణులు. ఫలితంగా ఇటు మీకు నచ్చిన దుస్తులు వేసుకోవచ్చు అటు సంతోషంగానూ ఉండచ్చు. అందుకే వార్డ్‌రోబ్‌లో మీ శరీరాకృతికి తగ్గ దుస్తుల్ని, కంఫర్ట్‌గా, స్టైలిష్‌గా కనిపించే అవుట్‌ఫిట్స్‌ని ఎప్పటికప్పుడు చేర్చుకుంటే సానుకూల దృక్పథం, సెల్ఫ్ లవ్ పెరుగుతాయంటున్నారు.
పోలికలొద్దు!
చాలా మంది అందం, దుస్తులు, డబ్బు విషయంలో ఇతరులతో తమను తాము పోల్చుకుంటారు. కానీ, ఇలా కంపేర్ చేసుకోవడం వల్ల మనలో అభద్రతా భావం పెరుగుతుంది. అందుకే ఎత్తు, శరీరం రంగు, బరువు వంటి విషయాల్లో ఇతరులతో పోల్చుకొని బాధపడడం కంటే హెల్దీగా, ఉత్సాహంగా ఉన్నామా? కెరీర్‌లో మనం పెట్టుకున్న లక్ష్యాల్ని చేరుకుంటున్నామా? అన్నదే పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులంటున్నారు. ఇదీ ఓ రకంగా సెల్ఫ్ లవ్‌ను పెంచుకునే మార్గమేనని చెబుతున్నారు.
మీకోసం మీరు!
ఎక్కువమంది మహిళలు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల గురించి పట్టించుకుంటూ, వారి పనులన్నీ చేసిపెడుతుంటారు. కానీ తమ గురించి తాము కొంత నిర్లక్ష్యం చేస్తుంటారు. దీనివల్ల కొన్నాళ్లకు ఒత్తిడి, యాంగ్జైటీకి లోనై నెగటివ్ ఆలోచనలు దరిచేరతాయి. ఈ పరిస్థితి రాకూడదంటే ఇంట్లో మీరు ఎన్ని పనులతో బిజీగా ఉన్నా కొద్దిసేపు మీకంటూ ప్రత్యేకంగా టైమ్ కేటాయించుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీకు ఇష్టమైన పనులు చేయడం, నచ్చినట్లుగా రెడీ అవడం, స్పాలకు వెళ్లడం, మనసుకు నచ్చిన వారితో టైమ్ స్పెండ్ చేయడం వంటివన్నీ ముఖ్యమే! ఇలాంటి పనుల వల్ల పాజిటివిటీతో పాటు సెల్ఫ్ లవ్ కూడా పెరుగుతుంది.
ఇవి కూడా చదవండి :
'మా వారు అప్పుడే కోపంగా, అంతలోనే ప్రశాంతంగా మారిపోతారు!'- ఆయన సమస్య పిల్లలకు వస్తుందా ?
గూగుల్లో ఎక్కువగా సెర్చ్ చేసిన వంటకం మనదే - బిర్యానీ మాత్రం కాదు