High Security at YS Jagan House : తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ నివాసం వద్ద పోలీసులు రక్షణ చర్యలు చేపట్టారు. జగన్ నివాసం పక్కనున్న పార్టీ కార్యాలయం ఎదుట గార్డెన్‌లో ఈ నెల 5న గడ్డి తగలబడి మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. దీనిపై వైఎస్సార్సీపీ నేతలు విమర్శలు చేశారు. గతంలో తమ నాయకుడి ఇంటి వద్ద కూటమి కార్యకర్తలు బీభత్సం సృష్టించారని ఆరోపించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా జగన్ ఇల్లు, కార్యాలయం వద్ద భద్రత కల్పించాలని, ఈ మంటలకు కారకులెవరో గుర్తించి దోషులపై చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ మేరకు వైఎస్సార్సీపీ వర్గాలు గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా పార్టీ కార్యాలయం వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలను ఇవ్వాలని పోలీసులు ఆ కార్యాలయ సిబ్బందికి నోటీసు ఇచ్చారు. అక్కడ మంటలు ఎలా అంటుకున్నాయి? అది ఆకతాయిల పనా? ఉద్దేశపూర్వకంగా ఎవరైనా చేశారా అనేది తేల్చేందుకు సీసీటీవీ ఫుటేజీలు ఇవ్వాలని తెలిపారు. దీనికి ఆ కార్యాలయ సిబ్బంది స్పందించడం లేదు.
Police on Jagan House Fire Incident : ఈ క్రమంలోనే పోలీసులు అక్కడ భద్రత చర్యల్లో భాగంగా నిఘా ఏర్పాటు చేశారు. మొత్తం ఎనిమిది సీసీ కెమెరాలను ఆదివారం నాడు ఏర్పాటు చేయించారు. వీటిని తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లోని మానిటర్‌కు అనుసంధానించారు. వైఎస్సార్సీపీ కార్యాలయం ఎదురుగా ఉన్న గార్డెన్‌లో గడ్డి తగలబడి మంటలు చెలరేగిన ఘటనపై విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఆయా మార్గాల్లోని సీసీటీవీ ఫుటేజీలను సేకరించిన పోలీసులు మంటలు చెలరేగిన ప్రాంతంలోని మట్టి, బూడిద నమూనాలను తాజాగా సేకరించి పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపారు.
మరోవైపు జగన్ ఇంటి సమీపంలో జరిగిన అగ్నిప్రమాదం పలు అనుమానాలకు తావిస్తోంది. గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డు పక్కన ఎండిపోయిన మొక్కలకు నిప్పు పెట్టారని అధికారులు భావిస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని నాలుగు రోజుల క్రితం పరిశీలించిన నగరపాలక సిబ్బంది ఎండిపోయిన చెత్తకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం వల్లే మంటలు చెలరేగాయని గుర్తించారు. మంటలు వచ్చిన వెంటనే జగన్ భద్రత సిబ్బంది ఆర్పేశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వకుండా వాళ్లే వాటిని ఆర్పడంతో అనుమానాలకు బలం చేకూరింది.