Eco Friendly Subjee Cooler: రైతుబజారుకు తీసుకొచ్చిన కూరగాయలు, ఆకుకూరలు ఫ్రెష్‌గా లేకపోతే ఎవరూ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపరు. ముఖ్యంగా ఆకుకూరలు అయితే కొద్ది గంటల్లోనే వాడిపోతున్నాయి. ఎంతో కష్టపడి పడి పండించిన పంటను పడేయలేక రైతులు తల్లడిల్లుతున్నారు. అదే విధంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. కూరగాయల కోసం కూలర్ పెట్టుకుందామా అంటే లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో వారి సమస్యలను గుర్తించి, ప్రత్యేకంగా పర్యావరణ హిత సబ్జీ కూలర్‌ను మార్కెటింగ్ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిని తీసుకోవాలనే ఆసక్తి ఉన్న రైతులకు రాయితీపైన వీటిని విక్రయించనున్నారు. ప్రయోగాత్మకంగా ఒక సబ్జీ కూలర్‌ను విశాఖలోని ఎంవీపీ రైతుబజారులో ఏర్పాటు చేశారు.
విద్యుత్తు అవసరం లేదు: ఈ సబ్జీ కూలర్ విద్యుత్ లేకుండానే పని చేస్తుంది. కేవలం నీటిని పోస్తే సరిపోతుంది. అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలను సుమారు 4 రోజుల వరకు ఇందులో నిల్వ చేసుకునే అవకాశం ఉంది. దీనిలో రోజూ 25 లీటర్ల వరకూ నీటితో నింపాలి. ఈ కూలర్‌కి నాలుగు వైపులా రంధ్రాలు ఉంటాయి. నాలుగువైపులా ఉన్న రంధ్రాల ద్వారా సమానంగా నీటిని నింపాలి. ఆ నీరు నాలుగువైపులా వ్యాపించి బయట నుంచి వచ్చే వేడి గాలిని నియంత్రింతడం ద్వారా కూలర్ లోపల చల్లగా ఉంటుంది. దీంతో కూరగాయలు, ఆకుకూరలు తాజాగా ఉంటాయి.
తక్కువ ధరకే కూలర్: సాధారణంగా ఆకుకూరలు విక్రయించే రైతులు ప్రతి 15 నిమిషాలకు వాటిపై నీటిని చిలకరిస్తూ ఉంటారు. ఆకుకూరలను ఈ సబ్జీ కూలర్‌లో నిల్వ ఉంచడం వలన తాజాదనం కోల్పోకుండా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. తద్వారా రైతులు ఆర్థికంగా నష్టపోకుండా ఉంటారని అన్నారు. రైతులు వీటిని కొనుగోలు చేయాలనుకుంటే 50% రాయితీతో మార్కెటింగ్ శాఖ సరఫరా చేస్తుంది. 100 కిలోల సామర్థ్యం కలిగిన ఈ సబ్జీ కూలర్ రాయితీపై కేవలం 25000 రూపాయలకే లభిస్తుంది. విద్యుత్తు ఖర్చు ఉండదని, మరమ్మతులు సైతం రావని అధికారులు తెలిపారు.
ఆకుకూరలు తింటున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి! వారంలో ఎన్ని సార్లు తినాలి?