Impact of Pests on Chilli Crop Farmers Problems in Guntur District : సరైన ధర లేకపోయినా సాగు మీద మమకారంతో మిరప పంట వేసిన అన్నదాతల్ని తెగుళ్లు భయపెడుతున్నాయి. దిగుబడి బాగా వస్తే కొంతమేర గట్టెక్కవచ్చని భావించిన కర్షకుల ఆశలపై బొబ్బర, నల్లి తెగుళ్లు నీళ్లు చల్లుతున్నాయి. తెగుళ్ల దెబ్బకు దిగుబడి భారీగా తగ్గే ప్రమాదం ఉందని గుంటూరు జిల్లా మిరప రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో వాణిజ్య పంటల్లో మిరపది అగ్రస్థానం. అయితే ఇది గతంలో అన్నట్లుగా పరిస్థితి మారింది. ఇతర పంటలతో పోలిస్తే పెట్టుబడి ఖర్చు బాగా పెరిగింది. దీంతో ఈ ఏడాది మిరప సాగు విస్తీర్ణం తగ్గింది. జిల్లాలో గతేడాది సుమారు 25 వేల ఎకరాల్లో మిరప పంట సాగు చేయగా ఈ ఏడాది 17 వేల ఎకరాలకే పరిమితమైంది. ఈ ఏడాది వర్షాలు సకాలంలో పడటంతోపాటు సాగర్ నుంచి నీళ్లు రావడంతో ధైర్యం చేసి రైతులు మిరప సాగు చేశారు.
అయితే రైతులు ఎర్ర బంగారంగా భావించే మిర్చి ఈ ఏడాది కన్నీళ్లు మిగిల్చే పరిస్థితులు నెలకొన్నాయి. తొలుత పంట పరిస్థితి బాగానే ఉన్నా, నెలరోజులుగా బొబ్బర, నల్లి తెగుళ్లు పంటను దెబ్బతీస్తున్నాయి. వేలాది రూపాయలు ఖర్చుపెట్టి పురుగుమందులు పిచికారీ చేసినా తెగుళ్ల బెడద తగ్గలేదు. దీంతో దిగుబడి తగ్గి ఎకరాకు 50 వేలకుపైగా నష్టం రావొచ్చని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మిర్చి ధర ఎందుకు తగ్గింది? విలవిలలాడుతున్న రైతన్నలు
గతేడాది మంచి ధర లేదని పంటను శీతల గిడ్డంగుల్లో దాచుకున్న అన్నదాతలు ఈ ఏడాది అప్పులు తెచ్చి మరీ మిరపసాగు చేశారు. నీటి సమస్య లేదని ఊపిరి పీల్చుకునే లోపే బొబ్బర తెగులు రైతుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. తెగులు సోకడంతో ఆకు ముడుచుకుపోయి మొక్క గిడసబారిపోతోంది. పొలం ఎండు ముఖం పడుతోంది. మందులు పిచికారీ చేసినా ప్రయోజనం లేక రైతులు తల్లడిల్లుతున్నారు. మేడికొండూరు, ఫిరంగిఫురం సహా అనేక మండలాల్లో బొబ్బర, నల్లి తెగుళ్ల సమస్య ఎక్కువగా ఉంది.
'గత సంవత్సరం పది ఎకరాలలో మిరప సాగు చేశాను. కానీ గిట్టుబాటు ధర లేకపోవడంతో శీతల గిడ్డంగిలో ఉంచాను. ఈ ఏడు నాలుగు ఎకరాల్లోనే పంట పెట్టాను దానికీ తెగుళ్లు వచ్చింది. మందులకోసం గిడ్డంగిలోని మిర్చీని తక్కువ ధరకే అమ్ముకున్నాను. ఎన్ని మందులు కొట్టినా ఇప్పుడు పంట ఏ మాత్రం కోలుకోవడం లేదు. సాగు నీటి సదుపాయం ఉన్నా ఈ తెగుళ్ల వల్ల రైతన్నలు నష్టాలపాలవుతున్నారు. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి.' -బాధిత రైతులు
మిర్చి పంట వేసిన రైతుల్లో ఎక్కువ మంది కౌలు రైతులే. దాదాపు 20 నుంచి 25 వేలు కౌలే చెల్లించాల్సి ఉంది. కనీసం కౌలు చెల్లించే పరిస్థితి లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. తెగుళ్ల ప్రభావంతో ఈ ఏడాది నష్టాల భారం తప్పదంటున్న రైతులు ప్రభుత్వమైనా గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకొని ఆదుకోవాలని కోరుతున్నారు.