Boat and Swimming Competitions in Konaseema District : ఆంధ్రా కేరళగా కోనసీమ ప్రసిద్ధి చెందింది. ఆ రాష్ట్రం తరహాలో పడవ పోటీలను ఈ సంక్రాంతికి కోనసీమ ప్రాంతంలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. లొల్లలాకుల చెంత గోదావరి గలగలలు, చుట్టూ కొబ్బరి చెట్లు, పచ్చని చేల నడుమ పంట కాలువల్లో ఈ పడవ పోటీల కోసం ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. పూత రేకులతో నోరూరించే ఆత్రేయపురం ప్రాంతం ఇందుకు వేదిక కానుంది.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరుతో పడవ, ఈత పోటీలు ఈ నెల 11, 12, 13 తేదీల్లో నిర్వహించనున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరితో పాటు అనంతపురం, విశాఖ, కృష్ణా తదితర జిల్లాలకు చెందిన జట్లు ఈ పోటీల్లో పాల్గొననున్నాయి. ఇందులో డ్రాగన్ పడవలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. వీటితో పాటే మహిళలకు రంగవల్లుల పోటీలు, చిన్నారులు, యువతకు గాలిపటాల పోటీలు నిర్వహించనున్నారు. సుమారు పదివేల మంది వీటిని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
బైక్ ఎక్కిన హైటెక్ హరిదాసు - సంక్రాంతి సందడి మొదలైంది
పంట కాలువలో పడవ పోటీలు : పర్యాటకంగా ఎంతో పేరుగాంచిన లొల్ల లాకుల ప్రాంతంలో ఈ పడవ పోటీలు నిర్వహించనున్నారు. ఆత్రేయపురం నుంచి ఉచ్చిలి మధ్య ప్రధాన పంట కాలువలో సుమారు వెయ్యి మీటర్ల పరిధిలో ఇవి జరుగుతాయి. పోటీలు విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం ఇప్పటికే సన్నద్ధమైంది. ఇటీవల జిల్లా కలెక్టర్ మహేష్‌కుమార్ నేతృత్వంలో ప్రోమోను కూడా విడుదల చేశారు.
విజేతలకు నగదు బహుమతులు : పడవ పోటీల్లో ప్రథమ విజేతకు రూ.లక్ష, ద్వితీయ స్థానం సాధిస్తే రూ.50 వేలు, తృతీయ స్థానంలో నిలిస్తే రూ.30 వేలు నగదు బహుమతులుగా అందించనున్నారు. పాల్గొన్న అందరికీ బహుమతులు ఇవ్వనున్నారు. రంగవల్లుల పోటీలకు రూ.10 వేలు, రూ.7,500, రూ.5 వేలు చొప్పున ఇస్తారు. అలాగే ఈత, గాలిపటాల పోటీలకు రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.7,500 చొప్పున మొదటి మూడు స్థానాల్లో నిలిచినవారికి ఇవ్వనున్నారు.
"ఈ సంబరాలను రాష్ట్ర పండగలా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనుంది. ప్రకృతి అందాలతో అలరారే లొల్లలాకులు, ఆత్రేయపురం, బ్యారేజీ, పిచ్చుకలంక పరిసరాలను పర్యాటక పరంగా అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తున్నాం." - బండారు సత్యానందరావు, ఎమ్మెల్యే
"పోటీలు వీక్షించేవారికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. పాల్గొనే క్రీడాకారులకు స్థానిక టీటీడీ కల్యాణ మండపం, కళాశాల తదితరచోట్ల వసతి సౌకర్యాలు కల్పిస్తున్నాం." - దండు శివరామరాజు, పోటీల నిర్వాహకుడు
అబ్బురపరుస్తున్న 100 మీటర్ల సంక్రాంతి ముగ్గు
ప్రయాణికులకు గుడ్‌న్యూస్ - సంక్రాంతికి 6,432 ప్రత్యేక బస్సులు