Anakapalle Jaggery Business : అనకాపల్లి మార్కెట్‌లో ఇంతకు ముందు కేవలం 15 నుంచి 16 కేజీల బెల్లం దిమ్మలు మాత్రమే తయారు చేసేవాళ్లు కానీ ఇకపై పది కేజీలు బరువు కలిగిన చిన్న బెల్లం దిమ్మలు అమ్మకానికి వచ్చాయి. జాతీయ స్థాయిలో బెల్లం విక్రయాలకు అనకాపల్లి మార్కెట్ గుర్తింపు పొందింది. జిల్లాలోని రైతులు పూర్వం నుంచి దిమ్మల రూపంలోనే బెల్లం తయారు చేస్తున్నారు. ఒకో బెల్లం దిమ్మ బరువు 15 నుంచి 16 కేజీలు ఉంటుంది. ఇక్కడ నుంచి ఎక్కువగా సరకు ఒడిశాకు, బెంగాల్‌కు ఎగుమతి అవుతుంది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో తయారవుతున్న బెల్లం దిమ్మబరువు 10 నుంచి 11 కేజీలు ఉంటుంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ వ్యాపారులు తక్కువ బరువున్న బెల్లం దిమ్మలు కొనుగోలుకే ఆసక్తి చూపుతున్నారు. ఇది అనకాపల్లి మార్కెట్ నుంచి ఎగుమతులపై ప్రభావం చూపుతోందని తయారీదారులు ఆవేదన చెందుతున్నారు
బహిరంగ మార్కెట్‌లో కేజీ బెల్లం ఖరీదు రూ.60 ఉంది. అనకాపల్లికి చెందిన సరకు ఒక దిమ్మ దాదాపు రూ. వెయ్యి అవుతుంది. అదే కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన దిమ్మలు రూ.600కే వస్తున్నాయి. ఒకేసారి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడం ఇష్టంలేని వినియోగదారులు చిన్న దిమ్మల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఈ విధంగా తయారు చేయాలని పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు, అనకాపల్లి వర్తక సంఘం ప్రతినిధులు చాలా కాలంగా చెబుతున్నారు. నాగులాపల్లి, మునగపాక, ఒంపోలు ప్రాంతాలకు చెందిన రైతులు పది కేజీల బరువుండే బెల్లం తయారు చేసి మార్కెట్‌కు తీసుకువస్తున్నారు. రైతులంతా ఇదే పరిమాణంలో తయారీ చేయాలని అప్పుడే ఎగుమతులకు అనుకూలంగా ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు.
చిన్న దిమ్మలకే ఎక్కువగా డిమాండ్ ఉంది : పలు ప్రాంతాల్లో చిన్న దిమ్మలకే డిమాండ్ ఉందని అనకాపల్లి వర్తక సంఘం కొణతాల లక్ష్మీనారాయణ తెలుపుతున్నారు. పది కేజీల బరువు వచ్చే విధంగా పాత్రలు తయారీ చేయించి కొందరు రైతులకు ఇప్పటికే అందించామన్నారు. దశల వారీగా అందరి రైతులకు ఇస్తామని ఆయన తలిపారు.