Pre Sankranti Celebrations in Gangur : రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల సంక్రాంతి కళ వచ్చేసింది. విద్య, ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్లిన వారంతా సొంతూళ్లకు చేరుకుని సంబరాలు ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరులో కమ్మవారి సేవా సమితి నిర్వహించిన సంక్రాంతి వేడుకలు అంబరాన్నంటాయి. ధనేకుల ఇంజినీరింగ్ కళాశాలలో వేదికకు ఈనాడు వ్యవస్థాపకుడు చెరుకూరి రామోజీరావు పేరిట నామకరణం చేసి వేడుకలు నిర్వహించారు.
ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు రకాల సాంస్కృతిక, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సృజనాత్మకతతో రంగవల్లులు వేసిన మహిళలు అమ్మవారికి పూజలు చేశారు. హరిదాసుల కీర్తనలు, అందంగా అలంకరించిన బసవన్నల ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పలువురు చిన్నారుల తమ చిట్టి పాదాలకు గజ్జకట్టి చేసిన కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శనలు ఆహుతులను అమితంగా ఆకట్టుకున్నాయి.
Sankranti Celebrations 2025 in AP : తప్పెటగుళ్లుతో పాడిన పాటలు, జానపద గీతాలకు యువతీ యువకుల నృత్యాలు చూసేందుకు ఆసక్తి కనబరిచారు. అమ్మవార్ల రూపాల్లో చిన్నారులు చేసిన ప్రదర్శన చూపుతిప్పుకోనివ్వలేదు. మ్యూజిక్‌కి అనుగుణంగా గుర్రం డాన్స్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చెరకు గడలు, తాటి తేగలు, అందరికీ పంచి వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను నేటి తరానికి తెలియజేశారు. శుద్ధమైన బెల్లంతో తయారు చేసిన అరిసెల రుచిని అందరికీ చూపించారు.
కృషి పట్టుదలతో ఉన్నత స్థానాలకు ఎదిగి అందరికీ ఆదర్శవంతులుగా నిలిచిన ప్రముఖులను సన్మానించారు. సంబరాల్లో పాల్గొన్న మహిళలు, యువతీ యువకులు, చిన్నారులకు పలు రకాల ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ వేడుకల్లో పాల్గొనడం పట్ల మహిళలు, చిన్నారులు సంతోషం వ్యక్తం చేశారు. ఏటా ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని ఉందని వారు తెలిపారు.
"ఈరోజు సంక్రాంతి అంటే పండగ వచ్చినప్పుడు ఒక రోజున జరుపుకొనే పరిస్థితి వచ్చింది. కమ్మ సంఘం పేరుతో పేదలకు సహాయం చేస్తున్నారు. కమ్మ కులంలో చాలా మంది మేధావులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. వారందరూ మనకు గర్వకారణం". - బోడె ప్రసాద్, ఎమ్మెల్యే
Makar Sankranti 2025 : వైభవంగా జరిగిన ఈ వేడుకలకు ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్, సుజనా చౌదరి, జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కమ్మవారి సేవా సమితి చేపడుతున్న సేవా కార్యక్రమాలు పేదవారికి ఉపయోగకరంగా ఉంటున్నాయని అతిథులు కితాబిచ్చారు. ఇతర కులాల అభివృద్ధికి కూడా కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. కమ్మవారి సేవా సమితి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పలువురు కొనియాడారు. నేటి తరానికి సంస్కృతి సంప్రదాయాలు తెలియజేయడమే లక్ష్యంగా ఈ వేడుకలు నిర్వహించామని కమ్మవారి సేవా సమతి నిర్వాహకులు తెలిపారు.
రంగురంగుల ముగ్గులు - హరిదాసుల కీర్తనలు - మొదలైన సంక్రాంతి సందడి