RAM GOPAL VARMA POLICE ENQUIRY: ‘అసలు పోలీసులు నాపై కేసులు ఎలా పెడతారు? ఎప్పుడో సంవత్సరం క్రితం చేసిన ట్వీట్ అది. రోజూ వివిధ అంశాలపై చాలా ట్వీట్లు చేస్తుంటా, అసలది ఎప్పుడు చేశానో కూడా గుర్తులేదు. ఒకరి మీద పోస్టులు పెడితే ఏ మాత్రం సంబంధం లేని మరో వ్యక్తి మనోభావాలు దెబ్బతిన్నాయట, ఇన్నాళ్ల తర్వాత ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు ఈ విషయం మీద కేసు ఎలా నమోదు చేస్తారో అర్థం కావటం లేదు’ అంటూ వివాదాస్పద డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ ఇంతకాలం చేస్తూ వచ్చిన కామెంట్స్.
ఇదీ కేసు: గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆర్జీవీ ‘వ్యూహం’ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా ప్రచార సమయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ వ్యక్తిత్వాలను కించపరిచే విధంగా మార్ఫింగ్ ఫొటోలతో ట్వీట్లు పెట్టారు. దీనిపై టీడీపీ మద్దిపాడు మండల పార్టీ కార్యదర్శి ఎం.రామలింగం ఫిర్యాదు మేరకు గతేడాది నవంబర్ 10వ తేదీన వర్మపై కేసు నమోదైంది.
పోలీసుల తీరుపై విమర్శలు: అయితే ఆర్జీవీ విచారణ సందర్భంగా పోలీసులు హడావిడి చేశారు. ఒంగోలు గ్రామీణ సర్కిల్ ఆఫీసు వద్ద మద్దిపాడు, సంతనూతలపాడు ఎస్సైలు శివరామయ్య, వి.అజయ్‌బాబు ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించారు. కార్యాలయం పరిసరాల్లో మీడియా తప్ప ఇతరులు ఎవరినీ అనుమతించలేదు. ప్రైవేట్ వ్యక్తులను సైతం అక్కడ నుంచి పంపించి వేశారు. సమీపంలోని షాప్‌లను మూసివేయించారు. రామ్‌గోపాల్ వర్మ వాహనం సజావుగా వచ్చేందుకు వీలుగా పాత జాతీయ రహదారి పైవంతెన వద్ద నుంచి సర్వీసు రోడ్డులో రాకపోకలను నిలిపివేశారు. ఇతరులు ఎవరూ రాకుండా పోలీసు వాహనాన్ని అడ్డుగా పెట్టారు. మరీ ఇంత హడావుడి అవసరమా అనే విమర్శలు వినిపించాయి.
గత్యంతరం లేకనే హాజరు: పోలీసు విచారణను తప్పించుకోవడానికి ఆర్జీవీ చేయని ప్రయత్న లేదు. నోటీసులు జారీ చేస్తే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నానని, ఇప్పుడు వస్తే నిర్మాణ వ్యయం పెరిగి నిర్మాతకు నష్టం వాటిల్లుతుందంటూ చెప్పుకొచ్చారు. తనని వర్చువల్ విధానంలో విచారించాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగితే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత టీవీలలో ప్రత్యక్షమై ఎక్కడికీ పారిపోలేదంటూ ప్రకటనలు ఇచ్చారు. పోలీసులు ఇంత చిన్న విషయాన్ని ఎందుకంత సీరియస్‌గా చూస్తున్నారని, వారు చేధించాల్సిన సీరియస్ కేసులు చాలానే ఉన్నాయ్ కదా అంటూ సూక్తులూ వల్లె వేశారు. చివరకు కోర్టు బెయిల్ ఇచ్చినా, పోలీసుల ఎదుట హాజరై విచారణకు సహకరించాలని చెప్పటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో హాజరయ్యారు.