Antarvedi Kalyanotsavam 2025 : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లా గోదావరి సాగర సంగమ క్షేత్రం అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణ మహోత్సవం వైభవంగా సాగింది. సౌభాగ్య ప్రదాయిని శ్రీదేవి, భూదేవితో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వామి వారికి అంతర్వేది ఆలయ ప్రాంగణంలో శుక్రవారం రాత్రి 12:55 గంటలకు దివ్య పరిణయోత్సవం వైభవోపతంగా నిర్వహించారు మూడు గంటలపైగా వివాహ మహోత్సవ క్రతువును నిర్వహించగా అశేష భక్తజనం తిలకించి పులకించారు.
భక్తుల కొంగు బంగారం , గోదావరి జిల్లాల వాసుల ఆరాధ్య దైవం అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మాఘ మాసం శుక్లపక్షం దశమి వేళ మృగశిరా నక్షత్రయుక్త వృశ్ఛిక లగ్న శుభ ముహూర్త సమయంలో మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛరణలు, భక్తుల గోవిందనామస్మరణల మధ్య కల్యాణోత్సవం జరిగింది. ఆద్యంతం అద్వితీయంగా సాగిన ప్రతిఘట్టం భక్తజనులను పరమానందభరితుల్ని చేసింది.
స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను కంకణధారణ, పాణిగ్రహణం చేసిన అనంతరం మాంగల్యధారణను రమణీయంగా నిర్వహించారు. తలంబ్రాల ఘట్టం కనులపండువగా సాగింది. స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా శోభిల్లుతున్న ఉత్సవమూర్తులను భక్తులు దర్శించుకుని తరించారు. ప్రధానార్చకుడు పాణింగిపల్లి శ్రీనివాసకిరణ్, వేద పండితులు, అర్చకస్వాములు కల్యాణ క్రతువులోని ప్రతి ఘట్టాన్ని శాస్త్రోక్తంగా జరిపి అందులోని అంతరార్ధాన్ని భక్తులకు కమనీయంగా వివరించారు.
Antarvedi Narasimha kalyanotsavam : కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, కలెక్టర్, ఎస్పీ దంపతులు, రాజోలు ఎమ్మెల్యే వరప్రసాద్, ఆలయ ఛైర్మన్ రామగోపాల రాజాబహద్దూర్, ఉత్సవ సేవా కమిటీ ఛైర్మన్ దిరిశాల బాలాజీ, ఆర్డీవో మాధవి, ఇతర సభ్యులు పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రం 4:15 గంటలకు స్వామివారి ఉత్సవమూర్తులను పంచముఖ ఆంజనేయస్వామి వాహనం, రాత్రి 8:45 గంటలకు కంచుగరుడ వాహనంపై కొలువుదీర్చి గ్రామోత్సవాన్ని జరిపారు. కల్యాణం అనంతరం అశేష సంఖ్యలో భక్తజనం సముద్రంలో పుణ్య స్నానాలు ఆచరించారు.
ఇవాళ మధ్యాహ్నం 2: 05 గంటలకులక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. మెరకవీధిలో సిద్ధం చేసిన రథాన్ని పుష్పాలంకరణ, భక్తులు సమర్పించిన అరటిగెలలతో సర్వాగ సుందరంగా తీర్చిదిద్దారు. పోలీసులు దారి పొడవునా భారీ బందోబస్తుకు ఏర్పాట్లు చేశారు. రథం తిరిగే మార్గంలో అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నెల 13 వరకు స్వామి వారి కల్యాణ మహోత్సవాలు జరగనున్నాయి.
పండు వెన్నెల్లో వైభవంగా ఒంటిమిట్ట సీతారాముల కల్యాణం - Vontimitta ramulavaari kalyanam
Mahaganapati Temple: అన్నమయ్య జిల్లాలో అంగరంగ వైభవంగా వరసిద్ధి వినాయక కళ్యాణం