BANDI SANJAY COMMENTS ON BRS : బీఆర్ఎస్ పార్టీపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. గులాబీ పార్టీ గంగలో కలిసిన పార్టీ అని ఆయన దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేసుకున్నా, ఏం ఉపయోగం లేదని తెలిపారు. అవినీతి, కుటుంబ పార్టీలకు బీజేపీ దూరంగా ఉంటుందన్నారు. కేసీఆర్, కేటీఆర్‌ను ప్రజలు చీదరించుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ ప్రస్థానం కాంగ్రెస్‌తోనే మొదలైందని, బీఆర్‌ఎస్ త్వరలోనే కాంగ్రెస్‌లో విలీనం కాబోతుందన్నారు. అందుకే కొంతమంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారని వ్యాఖ్యానించారు.
బీజేపీకి ఎవరి మద్దతు అవసరం లేదని, ప్రజల మద్దతు ఉంటే చాలని బండి సంజయ్ తెలిపారు. 6 గ్యారెంటీలను పక్కదోవ పట్టించడానికే విలీన ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రుణమాఫీపై రైతులు ఆందోళనలో ఉన్నారని, రైతులకు బ్యాంకుల నుంచి ఎన్‌వోసీలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన బీజేపీ కొట్లాడుతుందని బండి సంజయ్ స్పష్టం చేశారు.
నూతన భవనం ప్రారంభం : హైదరాబాద్ సుల్తాన్ బజార్లో నూతనంగా ఏర్పాటు చేసిన ది యంగ్ మేన్స్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ భవనాన్ని, స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలిసి కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. 150 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఈ సంస్థ, అనేక మంది మహనీయుల మార్గదర్శకంలో కొనసాగడం అభినందనీయమని బండి సంజయ్ అన్నారు. శ్యామ్ జీ నేతృత్వంలో ఈ భవనాన్ని ప్రారభించడం సంతోషంగా ఉందన్నారు. లక్ష్యం లేకుండా ఏ సంస్థ ముందుకు సాగదని, ఈ సంస్థకు మహోన్నత లక్ష్యం ఉందని వెల్లడించారు.