CM Revanth Reddy and CM Chandrababu Meeting : విభజన చట్టంలోని పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చలు జరిపారు. చంద్రబాబు, రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు, అధికారుల బృందం సుమారు రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించింది. సంప్రదింపుల కోసం ప్రజాభవన్‌కు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడును తెలంగాణ ప్రభుత్వం సాదరంగా ఆహ్వానించింది. రేవంత్‌రెడ్డి స్వయంగా వెళ్లి చంద్రబాబుకు పుష్పగుచ్ఛం ఇచ్చి ఆత్మీయంగా ఆహ్వానించి లోనికి తీసుకెళ్లారు. శాలువా కప్పి కాళోజి నారాయణరావు రచించిన 'నా గొడవ' పుస్తకాన్ని బహుకరించారు. రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్కకు చంద్రబాబునాయుడు వెంకటేశ్వరస్వామి ఫొటోలను బహుకరించారు.
ఈ సమావేశంలో తెలంగాణ తరఫున సీఎం రేవంత్‌రెడ్డితోపాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమారి ఉన్నారు. ఏపీ తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు మంత్రులు సత్యప్రసాద్, జనార్దన్‌రెడ్డి, కందుల దుర్గేశ్, సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇద్దరు సీఎస్‌లు ఆయా రాష్ట్రాల ఏజెండాలు చదివి వినిపించారు.
పదేళ్ల సమస్య పరిష్కారం మూడంచెల్లో : పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నీ వెంటనే పరిష్కరించే అవకాశం లేనందున మూడంచెల్లో పరిష్కరించుకోవాలని సీఎంలు నిర్ణయించారు. ఈ క్రమంలో ఇద్దరు ముఖ్యమంత్రులు అంశాలవారీగా చొరవతీసుకుని న్యాయపరమైన చిక్కులపైనా చర్చించారు. అధికారులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. అధికారులు తొలుత విభజన చట్టంలోని 9,10వ షెడ్యూళ్లలో ఉన్న సంస్థల ఆస్తుల విభజన, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అంశం, విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు, 15 ఎయిడెడ్ ప్రాజెక్టుల రుణ పంపకాలు, రెండు రాష్ట్రాల స్థానికత కలిగిన ఉద్యోగుల మార్పిడికి సంబంధించిన అంశాలను వివరించారు. ఆయా అంశాలపై ఇద్దరు సీఎంలు తమ అభిప్రాయలను తెలియజేశారు.
కృష్ణా జలాలపై కలిసి పని చేయాలి : అన్నింటిపైనా విస్తృతంగా చర్చించి ఏకాభిప్రాయానికి రావాలని సూచించారు. సీఎస్‌లు, మంత్రుల కమిటీ పరిధిలో పరిష్కారం దొరకని వాటిపై తమ స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బేషజాలు, పంతాలకు వెళ్లకుండా ఆలోచిస్తే కొన్ని సమస్యలు అధికారులే పరిష్కరించగలరన్నారు. సుధీర్ఘ ఉద్యమంతో ఏర్పాటైన తెలంగాణ ప్రజల భావోద్వేగాలకు అనుగుణంగా వెళ్లాలని రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కృష్ణా జలాల పంపిణీపై రెండు రాష్ట్రాలు కలిసి కేంద్రంతో మాట్లాడాలని రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారు. కేంద్రంలో కీలకంగా ఉన్న చంద్రబాబు రెండు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని రేవంత్‌రెడ్డి కోరారు. సున్నితమైన రెండు రాష్ట్రాల ప్రజల మనోభావాలను గౌరవించేలా నడుచుకుందామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు.
ఏపీ, తెలంగాణలో సుపరిపాలన ఉన్నందున రెండు రాష్ట్రాలకు మంచి జరుగుతుందని చంద్రబాబు తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కూడా తన వంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. విభజన సమస్యల పరిష్కారానికి రెండు వారాల్లో ఇరు రాష్ట్రాల సీఎస్‌లు, ఒక్కో రాష్ట్రం నుంచి ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. కమిటీల ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎస్‌లను సీఎంలు ఆదేశించారు.