తెలంగాణ

telangana

ETV Bharat / state

మతిస్థిమితం లేని యువతిపై గ్యాంగ్ రేప్ - ఆటో డ్రైవర్​ చేసిన ఫోన్​తో! - WOMAN GANG RAPE IN HYDERABAD

హైదరాబాద్‌లో యువతిపై గ్యాంగ్ రేప్ - మతిస్థిమితం లేని యువతిపై ఇద్దరు వ్యక్తుల అత్యాచారం

Hyderabad Woman Gang Rape
Hyderabad Woman Gang Rape (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 25, 2025, 10:24 AM IST

Hyderabad Woman Gang Rape : మతిస్థిమితం లేని యువతిపై ఇద్దరు దుర్మార్గులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అమానవీయ ఘటన హైదరాబాద్‌లోని మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం తెల్లవారు జామున జరిగింది. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి ఒంటరిగా ఉన్న యువతిని మద్యం మత్తులో ఉన్న నిందితులు అపహరించి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. తనపై జరిగిన దాష్టీకం గుర్తించి కనీసం చెప్పలేని స్థితిలో బాధితురాలు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఆమెను రక్షించి వైద్య పరీక్షలు చేయించగా, అత్యాచారం జరిగినట్లు తేలింది.

పోలీసులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం శాంతినగర్‌కు చెందిన ఇరగదిండ్ల బాలకుమార్‌ అలియాస్‌ శివకుమార్‌ నగరంలో డ్రైవరుగా పని చేస్తున్నాడు. మెదక్‌ జిల్లా అల్లాదుర్గం గుడిపెద్దాపూర్‌కు చెందిన గౌరగల్ల మహేశ్‌ పెయింటర్‌గా జీవనం సాగిస్తున్నాడు. వీరిద్దరూ చెడు వ్యసనాలకు అలవాటు పడి జులాయిగా తిరుగుతూ స్నేహితులయ్యారు. బాలకుమార్‌ మీద 8 చోరీ కేసులు ఉన్నాయి. అలాగే మహేశ్‌ హత్య, చోరీ కేసుల్లో జైలుకెళ్లి వచ్చాడు.

ఈ నెల 21న సాయంత్రం నిందితులిద్దరూ కలిసి పూటుగా మద్యం తాగారు. తెల్లవారుజామున 2 గంటలకు బొల్లారం చౌరస్తాకు వచ్చిన వీరికి కూకట్‌పల్లికి చెందిన మానసిక స్థితి సరిగాలేని ఓ యువతి కనిపించింది. ఆమె చిత్తు కాగితాలు, ప్లాస్టిక్‌ డబ్బాలు సేకరిస్తూ పొట్ట పోసుకుంటోంది. అర్ధరాత్రి వేళ ఆమె ఒంటరిగా ఉండటాన్ని వారిద్దరూ గుర్తించారు. దీంతో ఆ యువతి మీద కన్నేసిన నిందితులు ద్విచక్రవాహనం మీద ఎక్కించుకొని అమీన్‌పూర్‌ పరిధిలోని ఐలాపురం తండా వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు.

ఈ విషయం ఎలా తెలిసిందంటే? :నిందితులు యువతిని ద్విచక్ర వాహనం మీద తీసుకెళ్లడాన్ని ఓ ఆటో డ్రైవరు గుర్తించి డయల్‌ 100కు ఫోన్‌ చేసి సమాచారం అందించాడు. వెంటనే అప్రమత్తమైన మియాపూర్‌ పోలీసులు 3 బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల ద్వారా నిందితులు బాచుపల్లి వైపు తీసుకెళ్లినట్లు గుర్తించి నిర్మానుష్య ప్రాంతాల్లో దాదాపు 3 గంటలు సేపు గాలించారు. బాధితురాలు ఐడీఏ బొల్లారం రహదారిపై ఉన్నట్లు గుర్తించి ఆమెను రక్షించారు.

ఆ యువతి కనీసం మాట్లాడే స్థితిలో లేకపోవడం, తల్లిదండ్రుల వివరాలు కూడా చెప్పలేకపోయిందని పోలీసులు తెలిపారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించగా, అపహరించిన నిందితులు అత్యాచారం చేసినట్లు వైద్యులు తెలిపారు. సీసీ కెమెరాలు, ద్విచక్రవాహనాల ఆధారంగా నిందితులు చందానగర్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించారు. నిందితుల నుంచి పోలీసులు ద్విచక్రవాహనం, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

స్కూల్​లో దారుణం- 13ఏళ్ల స్టూడెంట్​పై టీచర్ల గ్యాంగ్ రేప్

అర్ధరాత్రి యువతిపై ఆటోడ్రైవర్‌ అత్యాచారం కేసు - నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

ABOUT THE AUTHOR

...view details