Two School Child Complaint to Collector on Land Issue :ఇంట్లో ఉత్సాహంగా ఉంటూ ఇంటి పనులు చేసే పిల్లలను చూశాం కానీ ఇంటివాళ్ల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన చిన్నారులను చూశారా ? భూ వివాదం సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఇద్దరు గురుకుల విద్యార్థులు జిల్లా కలెక్టర్‌ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. జిల్లాలోని ఎండ్లపల్లి మండలం చర్లపల్లికి చెందిన బండి శ్రీవాత్సవ్, అతని చెల్లి వైష్ణవి జగిత్యాలలోని గురుకుల పాఠశాలలో చదువుతున్నారు. సెలవులకు ఇంటికి వెళ్లిన చిన్నారులు పాఠశాలకు వెళుతున్నామని ఇంట్లో చెప్పి బస్సు ఎక్కి జగిత్యాల ప్రజావాణికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్‌ను కలిసి తమ తండ్రికి జరుగుతున్న అన్యాయన్ని పరిష్కరించాలని వేడుకున్నారు.
తమ తాత మల్లయ్యకు 7 ఎకరాల భూమి ఉందని కానీ తమ చిన్ననాన్న 5 ఎకరాల 18 గుంటల భూమి తమ తండ్రి తిరుపతికి తెలియకుండానే పట్టా చేసుకున్నారని.. తమకు న్యాయం చేయాలంటూ ఇద్దరు చిన్నారులు జిల్లా కలెక్టర్‌ను వేడుకున్నారు. ఈ నేపథ్యంలో చిన్నారుల ఫిర్యాదుకు స్పందించిన జిల్లా కలెక్టర్ విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. తండ్రికి జరిగిన అన్యాయంపై పిల్లలు న్యాయం కోసం ప్రజావాణికి రావటం చూసిన అధికారులు ఆశ్చర్యపోయారు. అయితే ఇదే విషయం తల్లిదండ్రులు శ్రీలత, తిరుపతిని అడిగితే తమకు తెలియకుండానే వచ్చారని, తమకు అన్యాయం జరిగింది వాస్తమేనని తెలిపారు.