తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలో 21 మంది ఐఏఎస్​లకు స్థాన చలనం - మార్పు మొదలైనట్లే! - IAS TRANSFERS in AP

IAS TRANSFERS in Andhra : ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అందరూ ఊహించినట్లుగానే చంద్రబాబు పాలనా ప్రక్షాళన చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో వైఎస్సార్సీపీ నేతలతో అంటకాగిన కీలక అధికారులపై వేటు పడింది. శ్రీలక్ష్మీ, రజత్‌ భార్గవ, ప్రవీణ్‌ ప్రకాశ్, మురళీధర్‌రెడ్డికి పోస్టింగ్‌లు ఇవ్వకుండా పక్కనపెట్టేశారు. గత ప్రభుత్వంలో వివాదస్పద అధికారులుగా ఉన్న గోపాలకృష్ణ ద్వివేది, ప్రవీణ్‌ కుమార్‌లకు కీలక బాధ్యతలు అప్పగించడం విస్మయపరుస్తోంది. త్వరలోనే పోలీసు శాఖలోనూ ప్రక్షాళన చేపట్టే అవకాశం ఉంది.

IAS TRANSFERS in Andhra
IAS TRANSFERS in Andhra (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 20, 2024, 8:10 AM IST

IAS TRANSFERS in AP :ఏపీలోనిగత ప్రభుత్వ హయాంలో వైఎస్సార్సీపీ నేతల అండ చూసుకుని రెచ్చిపోయిన అధికారులపై వేటు తప్పదని ఎన్నికల ముందు పదేపదే చెప్పిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఒకేసారి 21 మంది కీలక అధికారులకు స్థానచలనం కల్పించారు. వైఎస్సార్సీపీ నేతలతో అంటకాగిన సీనియర్ అధికారులకు పోస్టింగ్‌ ఇవ్వకుండా పక్కన కూర్చోబెట్టారు. కీలకశాఖల కార్యదర్శులు, విభాగాధిపతులుగా ఉన్న పలువురిని బదిలీ చేశారు.

  • శ్రీలక్ష్మి :జగన్‌ అవినీతి కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న శ్రీలక్ష్మి, వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే తెలంగాణ కేడర్‌ నుంచి ఏపీకి వచ్చారు. కార్యదర్శి హోదాలో ఉన్న ఆమెకు సీఎం జగన్‌ చకచకా పదోన్నతులు కల్పించి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని చేశారు. పురపాలకశాఖ బాధ్యతలు చేపట్టిన ఆమె అమరావతి విధ్వంసం, రుషికొండపై జగన్‌ కోసం విలాసవంతమైన భవనాల నిర్మాణంలో కీలకంగా వ్యవహరించారు. ఫలితంగా ఆమెపై బదిలీ వేటు వేస్తూ సాధారణ పరిపాలనశాఖలో రిపోర్ట్‌ చేయాలని ప్రభుత్వం సూచించింది.
  • ప్రవీణ్‌ ప్రకాశ్‌ : వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయంలో చేరి చక్రం తిప్పిన ప్రవీణ్‌ ప్రకాశ్‌ అత్యంత వివాదాస్పద అధికారిగా పేరు తెచ్చుకున్నారు. జగన్‌ కోసం రుషికొండపై విలాసవంతమైన భవనాల నిర్మాణానికి గుజరాత్‌ నుంచి ప్రముఖఆర్క్‌టెక్ట్‌ను తీసుకురావడంలో ఆయనదే కీలక పాత్ర. పాఠశాల విద్యాశాఖనూ, అస్తవ్యస్త నిర్ణయాలతో భ్రష్ఠుపట్టించారన్న ఆరోపణలున్నాయి.
  • రజత్‌ భార్గవ :ఎక్సైజ్​, పర్యాటకశాఖల ప్రత్యేక కార్యదర్శిగా అనేక వివాదాస్పద నిర్ణయాలను రజత్​ భార్గవ తీసుకున్నారు. జే-బ్రాండ్​ మద్యంతో వైఎస్సాఆర్​సీపీ ప్రభుత్వ పెద్దలు సాగించిన అడ్డగోలు దోపిడీకి పూర్తిగా సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి.
  • వివేక్‌ యాదవ్‌, హరిజవహర్‌లాల్‌ :అలాగే సీఆర్డీఏ కమిషనర్‌గా ఉన్న మరో వివాదాస్పద అధికారి వివేక్‌ యాదవ్‌తోపాటు, కార్మికశాఖ కార్యదర్శిగా ఉన్న హరిజవహర్‌లాల్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం వారికి ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.

సీఎం పీఠంపై మరో 30ఏళ్లు - రుషికొండపై కలల​ ​రాజప్రాసాదం కథ అదే! - Rushikonda Palace

గోపాలకృష్ణ ద్వివేదీ, ప్రవీణ్‌ కుమార్‌ :బదిలీల జాబితోలో వైఎస్సార్సీపీ హయాంలో అత్యంత వివాదాస్పద అధికారులుగా పేరు ఉన్న గోపాలకృష్ణ ద్వివేదీ, ప్రవీణ్‌ కుమార్‌లకు కీలకశాఖల బాధ్యతలు అప్పగించడం అధికారవర్గాల్లో చర్చనీయాంశమైంది. వ్యవసాయ, పశుసంవర్ధకశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ద్వివేదిని కార్మికశాఖకు బదిలీ చేశారు. అలాగే, గతంలో పనిచేసిన గనులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగానూ కొనసాగించారు. ప్రస్తుతం తిరుపతి జిల్లా కలెక్టర్‌గా ఉన్న ప్రవీణ్‌ కుమార్‌ను గనుల శాఖ కమిషనర్, డైరెక్టర్‌గా నియమించింది. ఎన్నికలకు కొన్ని నెలల ముందే తిరుపతి కలెక్టర్‌గా వెళ్లిన ప్రవీణ్‌ కుమార్‌ అంతకుముందు పురపాలకశాఖ కమిషనర్ సహా పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అప్పటి సీఎం కార్యదర్శి ధనుంజయరెడ్డి కనుసన్నల్లో అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. అలాంటి అధికారికి మళ్లీ కీలక బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశమైంది.

జి.సాయిప్రసాద్‌ :ఇక ప్రస్తుతం భూపరిపాలనశాఖ ప్రత్యేక కమిషనర్‌గా ఉన్న జి.సాయిప్రసాద్‌ను జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న మరో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి బుడితి రాజశేఖర్‌కు వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. గవర్నర్‌కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న అనిల్‌కుమార్‌ సింఘాల్‌ను కీలకమైన పురపాలకశాఖకు మార్చారు. రవాణా, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శిగా ఉన్న ప్రద్యుమ్నను ముఖ్యమంత్రి కార్యదర్శిగా నియమించారు. కీలకమైన సీఆర్డీఏ పగ్గాలను కాటమనేని భాస్కర్‌కు అప్పగించారు. అమరావతి నిర్మాణాన్ని మళ్లీ పరుగులు పెట్టించాలంటే సమర్థుడైన భాస్కర్‌ వంటి అధికారితోనే సాధ్యమని భావించారు.

ఇక ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న శ్యామలరావుని ఇటీవల టీటీడీ ఈవోగా ప్రభుత్వం బదిలీ చేయగా ఆయన స్థానంలో ఇప్పుడు సౌరభ్‌గౌర్‌ని ఆ శాఖ కార్యదర్శిగా నియమించింది. నైపుణ్యాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శిగానూ ఆయనకు పూర్తి అదనపు బాధ్యత అప్పగించింది. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా కోనశశిధర్‌ను నియమించింది. ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న ఐటీ శాఖ పూర్తి అదనపు బాధ్యతలూ ఆయనకే అప్పగించింది.

వైఎస్సార్సీపీ హయాంలో ఆర్థికశాఖను భ్రష్టిపట్టించిన ఆశాఖ కార్యదర్శి సత్యనారాయణ స్థానంలో జానికిని కార్యదర్శిగా నియమించింది. మరో కార్యదర్శిగా వాడ్రేవు వినయ్‌చందన్‌ నియమించింది. ఆర్థిఖశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న రావత్‌కూ స్థానచలనం ఖాయమని తెలుస్తోంది. ప్రస్తుత బదిలీల జాబితాలో ఆయన పేరు లేకున్నా ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఆయన స్థానంలో కేంద్ర సర్వీసులో ఉన్న పీయూష్‌ కుమార్‌ని నియమిస్తారని తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో మరి కొందరు కార్యదర్శులు, విభాగాధిపతుల బదిలీలు జరగనున్నాయి. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలనూ ప్రభుత్వం మార్చనుందని తెలుస్తోంది.

మూడు రాజధానుల ఆట ముగిసింది - ఇక నుంచి ఏపీ క్యాపిటల్ అమరావతి : చంద్రబాబు - AP CM CHANDRABABU OATH CEREMONY

ABOUT THE AUTHOR

...view details