Turmeric Price Hits High In Nizamabad :దేశంలో పసుపు కొనుగోళ్లలో ప్రత్యేక స్థానం ఉన్న నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ సీజన్‌లో సుమారు వెయ్యి కోట్ల రూపాయల వరకు లావాదేవీలు జరిగాయి. జిల్లాలో సాగు విస్తీర్ణం తగ్గినా కొనుగోళ్లలో వృద్ధి కనిపించింది. జిల్లాతో పాటు సరిహద్దున ఉన్న నిర్మల్, జగిత్యాల నుంచి సరుకు భారీగా వచ్చింది. అక్కడ స్థానికంగా మార్కెట్ ఉన్నప్పటికీ నిజామాబాద్ యార్డులో ఈ సారి గిట్టుబాటు ధర రావడంతో రైతులు ఇక్కడికి వచ్చేందుకే మొగ్గు చూపారు. దాదాపు పసుపు పంట విక్రయాలు పూర్తి కాగా ఈ సీజన్ రైతులకు ఆశాజనకంగా ముగిసింది.
పసుపు క్వింటాకు రూ.10 వేలు వస్తే గగనమనుకునే స్థాయికి దిగజారడంతో జిల్లాలో 36వేల ఎకరాలు సాగయ్యే విస్తీర్ణం కాస్త 25 వేలకు తగ్గిపోయింది. గతేడాది వరకు క్వింటా నమూనా ధర రూ.6వేల 500కి మించకపోడంతో రైతులు సాగుపై ఆశలు వదిలేశారు. అయితే అనూహ్యంగా జులై నుంచి పసుపు ధర ఎగబాకింది. ఏకంగా గరిష్ట ధర రూ.18 వేలు దాటింది. చివరివరకు ఇదే ఊపు కొనసాగింది. సగటున రూ.10 వేల 960 దక్కి పసుపురికార్డు సృష్టించింది. ఈ సీజన్లో 9లక్షల 59వేల 743 క్వింటాళ్లకు ఒక వెయ్యి 7కోట్లకు పైగానే లావాదేవీలు జరిగాయి. ఇందులో ఇందూరు జిల్లా రైతుల వాటా 5లక్షల 50వేల క్వింటాళ్లయితే రూ.577 కోట్ల 50 లక్షల లావాదేవీలు జరిగాయి.
ఆల్‌టైం రికార్డుగా మారిన పసుపు ధర - ఆనందంలో అన్నదాతలు
Turmeric Prices Hike In Telangana : ఉమ్మడి జిల్లాకు గుండెకాయగా ఉన్న నిజామాబాద్ వ్యవసాయ యార్డు ద్వారానే మార్కెటింగ్ శాఖకు అత్యధిక ఆదాయం వస్తోంది. వ్యవసాయోత్పత్తుల కొనుగోళ్లపై ఒక శాతం కమీషన్ రూపంలో మార్కెట్ ఖజానాకు చేరుతుంది. ఒక్క పసుపు పంట ద్వారానే రూ.10 కోట్ల వరకు మార్కెట్‌కు ఆదాయం సమకూరనుంది. వాస్తవానికి మూడేళ్లుగా పసుపుసాగు, దిగుబడులు తగ్గడంతో మార్కెట్ యార్డు ఆదాయంపై ప్రభావం పడింది. ఈసారి ధర ఆశాజనకంగా ఉండటంతో లావాదేవీలు భారీగా జరిగాయి. రైతులకు గిట్టుబాటు ధర లభించింది.