TTD Instructions for Devotees Going to Tirumala by Walk :తిరుపతి అనగానే అందరికి గుర్తుకు వచ్చేది లడ్డూ, మెట్లు. 'నా కోరిక తీర్చు భగవంతుడా నేను కాలినడకన వచ్చి నిన్ను దర్శించుకుంటా' అని భక్తులు కోరికలు కోరుకుంటారు. అలా శ్రీవారిని మెట్లు ఎక్కి దర్శించుకుంటున్న భక్తుల సంఖ్య అనేకం. కానీ ఇటీవల తిరుమలకు కాలి నడకన వచ్చిన భక్తుల్లో కొందరు అస్వస్థతకు గురైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో టీటీడీ అప్రమత్తమైంది. కాలినడకన వచ్చి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్న భక్తులకు టీటీడీ పలు సూచనలు చేసింది. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వారైనా మెట్ల మార్గంలో రాకుడదని, ఒకవేళ రావాల్సి వస్తే, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వైద్య సదుపాయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? అన్ని విషయాలను టీటీడీ వివరించింది. తిరుమలకు వచ్చేముందు ఇవి తప్పుకుండా తెసుకోవాలని సూచించింది.
- 60ఏళ్లు దాటిన వృద్ధులు, మధుమేహం, అధిక రక్తపోటు, ఉబ్బసం, మూర్ఛ, కీళ్ల వ్యాధులు ఉన్న భక్తులు తిరుమలకు కాలినడకన రావడం శ్రేయస్కరం కాదు.
- ఊబకాయంతో బాధపడుతున్న భక్తులు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తిరుమల కొండకు నడక దారిన రావడం మంచిది కాదు.
- తిరుమల కొండ సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉంటుంది కనుక ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటుంది. కాలినడకన రావడం చాలా ఒత్తిడితో కూడుకున్న విషయం. అందుకే గుండె సంబంధిత వ్యాధులు, ఉబ్బస వ్యాధిని తీవ్రతరం చేసే అవకాశం ఉంది. భక్తులు అందుకు తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలి.
- దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తులు వారి రోజు వారి మందులు వెంట తెచ్చుకుంటే ఉత్తమం.
- కాలినడకన వచ్చే భక్తులకు ఏమైనా సమస్యలు వస్తే అలిపిరి కాలిబాట మార్గంలోని 1500 మెట్టు, గాలి గోపురం, భాష్యకార్ల సన్నిధి దగ్గర వైద్య సహాయం లభిస్తుంది.
- తిరుమలలోని ఆశ్వినీ ఆసుపత్రి, ఇతర వైద్యశాలల్లో 24×7 వైద్య సదుపాయం అందుబాటులో ఉంటుంది.
- దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అత్యవసర పరిస్థితుల్లో తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో డయాలసిస్ సౌకర్యం కల్పిస్తుందని టీటీడీ తెలిపింది.