TTD Arrangements for Vaikunta Dwara Darshanam:తిరుమల శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు సాగనున్న వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 10 నుంచి 19 వరకు 10 రోజుల పాటు రోజుకు దాదాపు 70 వేలకు పైగా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేలా టీటీడీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసిన రోజుకు 40 వేల చొప్పున 10 రోజులకు 4 లక్షల సర్వదర్శన టోకెన్లను తిరుపతిలో 8, తిరుమలలో ఒక కేంద్రం ద్వారా జారీ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది.
దర్శన టికెట్లు ఉన్నవారిని మాత్రమే క్యూలైన్లలోకి అనుమతించి దర్శనాలు కల్పించేలా ప్రణాళిక చేపట్టారు. ఏకాదశి మొదలు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లకు టీటీడీ పలు చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకన్న చౌదరి తెలిపారు.
వైకుంఠ ద్వార దర్శన నిర్ణయాలు:
- వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల శ్రీవాణి టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేశారు
- వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల ఎస్‌ఈడీ (Special Entry Darshan) టోకెన్లు ఆన్‌లైన్‌లో విడుదల చేశారు.
- జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 10 రోజులకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి తిరుపతిలో 8 సెంటర్లు, తిరుమలలో ఒక కేంద్రంలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తారు.
- తిరుపతిలోని ఎంఆర్ పల్లి, జీవకోన, రామానాయుడు స్కూల్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా స్టేడియం, శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనంలో టోకెన్లను జారీ చేస్తారు.
- టోకెన్ జారీ కేంద్రాల వద్ద భక్తులకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
- వైకుంఠ ద్వార దర్శన రోజులలో టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. టికెట్లు లేని భక్తులను క్యూలైన్లలోకి అనుమతించమని తెలిపారు.
- వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 4.45 గంటలకు ప్రొటోకాల్ దర్శనాలు ప్రారంభమవుతాయి.
- వైకుంఠ ఏకాదశి రోజు అధిక రద్దీ కారణంగా ఆలయంలో వేదాశీర్వచనం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
- వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు స్వర్ణరథం
- వైకుంఠ ద్వాదశి రోజున ఉదయం 5.30 గంటల నుంచి 6.30 వరకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం
- తిరుమల వచ్చే గోవిందమాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన సదుపాయం ఉండదని తెలిపారు.
- వైకుంఠ ఏకాదశి రోజున టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది సమన్వయంతో తిరుమలలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు.
- ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు.
- టీ, కాఫీ, పాలు, ఉప్మా, చక్కెర పొంగలి, పొంగలి పంపిణీ చేయాలని నిర్ణయించారు.
- లడ్డూ ప్రసాదం కోసం భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ప్రతిరోజూ అందుబాటులో మూడున్నర లక్షల లడ్డూలు అందుబాటులో ఉంచనున్నారు. అదనంగా మరో 3.50 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్ ఉంచుకోవాలని సూచించారు.
తిరుమల మెట్ల మార్గంలో భారీ కొండచిలువ - పరుగులు తీసిన భక్తులు
ఇంద్రకీలాద్రిపై ముగిసిన భవానీదీక్ష విరమణలు - ఈ నెల 28 నుంచి ఆర్జిత సేవలు