తెలంగాణ

telangana

ETV Bharat / state

తిరుమల వెళ్లే వారికి బిగ్ అలెర్ట్ - బ్రేక్ దర్శనాలు, సిఫార్సు లేఖలు రద్దు! - TTD CANCELLATION ON BREAK DARSHAN

ఏపీలో భారీవర్షాలతో అప్రమత్తమైన టీటీడీ - బ్రేక్ దర్శనాలు, సిఫార్సు లేఖలు రద్దుకు నిర్ణయం - వచ్చే 3 రోజులు ఏపీలో భారీవర్షాలు

TTD Decision On Break Darshan Cancellation
TTD Decision On Break Darshan Cancellation (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 14, 2024, 7:29 PM IST

Updated : Oct 14, 2024, 8:38 PM IST

TTD Decision On Break Darshan Cancellation :బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం తిరుమలకు వెళ్లే భక్తులపై కూడా పడింది. వచ్చే మూడు రోజులు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున తిరుమల తిరుపతి దేవస్థానం - టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. భారీవర్షాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మధ్యాహ్నం సిబ్బందితో సమావేశమైన టీటీడీ ఈవో రాగల 36 గంటల్లో కురిసే వర్షాలపై చర్చించారు.

ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈనెల 15న సిఫార్సు లేఖలు అనుమతించబోమని టీటీడీ ప్రకటించింది. 16న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. భక్తుల భద్రత దృష్ట్యా బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో శ్యామలరావు వెల్లడించారు. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్​లో ఇప్పటికే వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో కుండపోతగా వానలు పడుతున్నాయి. చాలా చోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు ప్రమాదకరస్థాయికి చేరుకున్నాయి. తుమ్మల పంట సముద్రతీరంలో 20 మీటర్ల వరకు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. మత్స్యకారులు సముద్రపు వేటకు వెళ్లవద్దని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే వెళ్లిన వారు ఉంటే తిరిగి రావాలని సూచించారు.

అప్రమత్తమైన చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అధికారులు కంట్రోల్‌రూమ్స్‌ ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుమలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టీటీడీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. వీఐపీ బ్రేక్ దర్శనం, సిఫార్సు లేఖల రద్దుపై నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు భారీవర్షాలు కురిస్తే కొండ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశంలో సిబ్బందికి ఈవో పలు సూచనలు చేశారు. అలాగే ట్రాఫిక్, విద్యుత్ అంతరాయం లేకుండా సంబంధిత విభాగాలు అలెర్ట్​గా ఉండాలని సూచించారు.

తిరుమలలో రెండురోజుల క్రితమే శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. సుమారు 8 రోజులపాటు వివిధ వాహన సేవలపై అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు భక్తులకు దర్శనమిచ్చారు. సుమారు 15 లక్షల మందికి పైగా భక్తులు దేవదేవుని వాహనసేవలను తిలకించి పునీతులయ్యారు.

Last Updated : Oct 14, 2024, 8:38 PM IST

ABOUT THE AUTHOR

...view details