Tamilnadu Sambar Recipe: మనలో చాలా మందికి వేడి వేడి సాంబార్ అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. ఇంకా ప్రాంతాన్ని బట్టి తయారీ విధానం, రుచి మారుతుంటుంది. అయితే, ఎన్ని రకాల సాంబార్లు ఉన్నా.. తమిళనాడు సాంబార్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. దీన్ని వేడివేడిగా అన్నంతో, టిఫిన్స్‌తో తింటే ఎంతో రుచిగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? మరి ఇంకెందుకు ఆలస్యం ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- 1 కప్పు కందిపప్పు (30 నిమిషాలు నానపెట్టినది)
- రెండు ఉల్లిపాయలు
- 3 టమాటాలు
- ఒక టీ స్పూన్ పసుపు
- ఒక టీ స్పూన్ ఉప్పు
- పావు టీ స్పూన్ ఇంగువా
- 3 టేబుల్ స్పూన్ల నెయ్యి
- ఒక టీ స్పూన్ మినప్పప్పు
- ఒక టీ స్పూన్ ఆవాలు
- ఒక టీ స్పూన్ జీలకర్ర
- 2 ఎండుమిరపకాయలు
- 300 గ్రాముల చిన్న ఉల్లిపాయలు
- ఒక ములక్కాడ ముక్కలు
- అర కప్పు చిక్కటి చింతపండు ప్యూరీ
- ఒకటిన్నర కప్పుల నీళ్ళు
- ఒక టీ స్పూన్ ఉప్పు
- 2 రెబ్బల కరివేపాకులు
- 2 టీ స్పూన్లు బెల్లం
- తరిగిన కొత్తిమీర
మసాలా పేస్టు కోసం కావాల్సిన పదార్థాలు
- ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు
- ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు
- 2 టేబుల్ స్పూన్ల ధనియాలు
- 12 ఎండుమిరపకాయలు
- అర కప్పు తురిమిన పచ్చికొబ్బరి
- పావు టీ స్పూన్ ఇంగువ
తయారుచేసే విధానం:
- ముందుగా స్టౌ ఆన్ చేసి కుక్కర్లో నానపెట్టిన కందిపప్పు, ఉల్లిపాయలు, టమాటాలు, ఉప్పు, పసుపు, ఇంగువ వేసి అవి మునిగేంత వరకూ నీళ్లు పోసి బాగా కలపాలి.
- ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఐదు విజిల్స్ వచ్చేంత వరకూ మీడియం మంట మీద ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
- మరోవైపు సాంబార్ పేస్టు కోసం స్టౌపై ఒక ప్యాన్ పెట్టి అందులో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ధనియాలు వేసి రెండు నిమిషాలు పొడిగా వేయించాలి.
- ఆ తర్వాత ఎండు మిరపకాయలు, తురిమిన పచ్చికొబ్బరి ఒకదాని తర్వాత ఒకటి వేసి కాస్త దోరగా వేయించాలి
- చివరగా ఇంగువ వేసి ఇంకొద్దిగా వేయించి పక్కకు పెట్టుకుని పూర్తిగా చల్లారనివ్వాలి.
- అనంతరం చల్లారిన పదార్థాలను మిక్సీలో వేసి ఒకసారి మెత్తటి పొడిగా, తర్వాత కొన్ని నీళ్లు పోసి పేస్టుగా గ్రైండ్ చేసి పక్కనపెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌపైన ఒక వెడల్పాటి కడాయి పెట్టి అందులో నెయ్యి వేసి వేడి చేసి మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి.
- తర్వాత ఎండుమిరపకాయలు, చిన్న ఉల్లిపాయలు, ములక్కాడ ముక్కలు వేసి ఐదు నిమిషాలు వేయించాలి.
- కాసేపయ్యాక సాంబార్ మసాలా పేస్టు, కొన్ని నీళ్లు పోసి మొత్తమంతా కలిపి చింతపండు గుజ్జు వేసుకోవాలి.
- ఇప్పుడు ఉడికించిన పప్పు మిశ్రమం వేసి, కొన్ని నీళ్లు పోసి కలపాలి. (కావాలంటే రుచి చూసి ఉప్పు వేసుకోవచ్చు)
- ఆ తర్వాత కరివేపాకు కూడా వేసి సాంబార్‌ను ఒకసారి కలిపి, మూత పెట్టి కనీసం పది నిమిషాలు ఉడికించాలి.
- ఇక చివర్లో బెల్లం వేసి కలిపి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ తమిళనాడు సాంబార్ రెడీ!
షుగర్‌ను తగ్గించే 'మినుముల పులగం' ఎప్పుడైనా తిన్నారా? శరీరానికీ ఎంతో బలాన్ని ఇస్తుందట!
నూనె లేకుండానే టేస్టీ 'చిల్లీ చికెన్'- ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చు!