TTD Steps to Provide Quality Food to Devotees : పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలకు వచ్చే భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదాలు అందచేసేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. గతంలో ఉన్న నాణ్యత లోపించిన ఆహారానికి స్వస్తి పలికి భక్తులకు సంతృప్తికర స్థాయిలో నిత్యాన్నదాన కార్యక్రమం కొనసాగించడానికి కీలక నిర్ణయాలు తీసుకుంది. అలాగే ప్రైవేటు హోటల్స్‌పైన ప్రత్యేక దృష్టి పెట్టింది.
తిరుమలలో గణనీయమైన మార్పులు :వెంగమాంబ నిత్యాన్నదాన సత్రంలో భక్తుల నిరసనలు, నాణ్యత ప్రమాణాలపై ఆందోళనలు, ఎంతో పవిత్రంగా భావించే అన్నప్రసాదాలనూ స్వీకరించలేక వదిలేసిన పరిస్థితులు వైఎస్సార్సీపీ పాలనలో నిత్యకృత్యాలుగా ఉండేవి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక తిరుమల పుణ్యక్షేత్రంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దర్శనాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చిన టీటీడీ వారికి నాణ్యమైన ఆహార పదార్థాలు అందించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. రోజుకు 80 వేల మందికిపైగా అన్నప్రసాదాలు అందచేస్తున్న వెంగమాంబ అన్నదాన సత్రంలో నాణ్యత ప్రమాణాలను పెంచారు. ఉదయం ఏడు నుంచి రాత్రి 11 గంటల వరకు నిరంతరాయంగా సాగే అన్న ప్రసాద వితరణలో నాణ్యతకు పెద్దపీట వేస్తోంది.
భక్తుల సౌకర్యాలపై ఫోకస్- తిరుమలలో మార్పులపై భక్తుల ఆనందం - AP Govt Key Changes in Tirumala
నాణ్యత లోపించిన ఆహారానికి స్వస్తి : శ్యామలరావు, అదనపు ఈవోగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన వెంకయ్య చౌదరి అన్నప్రసాదాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించారు. వెంగమాంబ అన్నదాన సత్రంలో అన్నప్రసాద వితరణలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అల్పాహార వితరణ సాగుతోంది. గతంలో రాత్రి పది గంటలకే నిలిపివేయడంతో పాటు నాణ్యత లోపించిన ఆహారాన్ని ఒకే రకమైన పదార్థాలను అందచేసేవారు.