Pawan Kalyan Responds to Attack on Galiveedu MPDO: అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై జరిగిన దాడిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని, ఈ దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో ఉన్న జవహర్ బాబుపై వైఎస్సార్సీపీ నేత దాడి చేయడం అప్రజాస్వామిక చర్య అని, ఇటువంటి దౌర్జన్యాలకు, రౌడీ చర్యలకు కూటమి ప్రభుత్వంలో తావు లేదని పవన్ స్పష్టం చేశారు. ఎంపీడీవోపై జరిగిన దాడి గురించి అధికారులతో పవన్ కల్యాణ్ చర్చించారు.
దీనికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత ఎంపీడీవోకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఎంపీడీవోకు, ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పాలని సూచించారు. జవహర్ బాబుపై దాడి చేసినవారికి రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్లా ఏ మాత్రం గౌరవం లేదని అర్థం అవుతోందని దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా బలమైన సంకేతం ఇవ్వాలని చెప్పారు. మండల పరిషత్ కార్యాలయంలో చోటు చేసుకున్న దాడిపై విచారణ చేయడంతోపాటు ఎంపీడీవో ఆరోగ్యం గురించి నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ను పవన్ కల్యాణ్ ఆదేశించారు. వైఎస్సార్సీపీ నేతల దాడిలో గాయపడిన ఎంపీడీవోను పవన్ నేడు పరామర్శించనున్నారు.
అచ్చెన్నాయుడు ఆగ్రహం: ఎంపీడీవో జవహర్‌బాబుపై దాడిని మంత్రి అచ్చెన్నాయుడు ఖండించారు. ఇటువంటి దాడులకు కూటమి ప్రభుత్వంలో తావు లేదని, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చేసిన అరాచకాలు ఇప్పుడు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
ఇదీ జరిగింది: గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై వైఎస్సార్సీపీ నేత సుదర్శన్ రెడ్డి, ఆయన అనుచరులు విచక్షణారహితంగా దాడి చేశారు. గాలివీడు ఎంపీపీ పద్మావతమ్మ కుమారుడు సుదర్శన్ రెడ్డి దాడికి పాల్పడినట్లు ఎంపీడీవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఛాంబర్లో ఉన్న తన వద్దకు సుదర్శన్ రెడ్డి వచ్చి ఎంపీపీ గది తాళాలు ఇవ్వాలని అడిగారని ఎంపీడీవో తెలిపారు. ఎంపీపీ లేకుండా తాళాలు ఇవ్వడం కుదరదని చెప్పడంతో దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సుదర్శన్, అతని అనుచరులు విచక్షణారహితంగా కొట్టారని వాపోయారు. దాడి చేసిన వైఎస్సార్సీపీ పోలీసులు కూడా ఆ ప్రాంతంలో ఉండడంతో వారందరిని బలవంతంగా బయటికి తీసుకొచ్చారు. ఎంపీడీవోకి గాయాలవ్వడంతో కార్యాలయంలోనే వైద్యులు ప్రాథమిక చికిత్సలు అందించి అక్కడి నుంచి రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
రెచ్చిపోయిన వైఎస్సార్సీపీ నేత - ఎంపీపీ గది తాళాలివ్వలేదని ఎంపీడీవోపై దాడి